Private School Fees In Telangana : ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం చట్టం తీసుకురానుంది. దీనికి సంబంధించిన బిల్లును వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ప్రవశపెడుతుందా? లేక కొంత సమయం పడుతుందా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులు అధికంగా వసూలు చేస్తున్నారు.
దీని నియంత్రణపై అధ్యయనం చేసిన తెలంగాణ విద్యా కమిషన్, 'తెలంగాణ ప్రైవేట్ ఆన్ఎయిడెడ్ స్కూల్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ ముసాయిదా బిల్లు 2025' పేరిట జనవరి 24న ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. అందులోని అంశాలను ప్రస్తుతం విద్యాశాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. కొన్ని మార్పులు చేర్పులతో త్వరలో ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నారు.
విద్యారంగ సమస్యలపై మంత్రివర్గం : విద్యారంగ సమస్యలపై 2024 జూలైలో ప్రభుత్వం దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సీతక్క, పొన్నం ప్రభాకర్తో మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. దీంట్లో చర్చించిన తర్వాతే కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఫీజుల నియంత్రణపైనా కమిటీ చర్చిస్తుంది. మధ్యప్రదేశ్, గుజరాత్లలో అక్కడి ప్రభుత్వాలు 2017 తెచ్చిన ఫీజుల నియంత్రణ చట్టాలను, గత జీవోలు, కోర్టు కేసులు తదితర అంశాలను విద్యాశాఖ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
ప్రభుత్వానికి నివేదిక : 1994 జనవరి 1న జారీ చేసిన జీవో-1లో ఒక్కో విద్యార్థికి ఎంత విస్తీర్ణం ఉండాలో నిర్ణయించారు. విదేశాల్లో యూనివర్సిటీలు సైతం కొద్దిపాటి స్థలంలోనే ఉంటున్నాయి. కాకుంటే బహుళ అంతస్తుల భవనాల్లో నిర్వహిస్తుంటారు. అందువల్ల వివిధ సౌకర్యాలు, పాటించే నాణ్యతా ప్రమాణాలను చూసి ఫీజులను నిర్ణయిస్తారని ఒక అధికారి తెలిపారు. పాఠశాలకున్న స్థల విస్తీర్ణాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోరని అధికారులు తెలుపుతున్నారు. కొన్ని మార్పులతో ప్రభుత్వానికి నివేదిక అందించనున్నారు.
గతంలో రుసుముల నియంత్రణపై జీవో జారీ చేసినా న్యాయపరమైన సమస్యలతో ప్రక్రియ ఆగిపోయిందని అందువల్ల నియంత్రణకు చట్టం చేయాలని విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. చట్టం చేయాలంటే అసెంబ్లీలో బిల్లు పెట్టాల్సి ఉంటుంది. దీన్ని ఎప్పుడు ప్రవేశపెడతారన్న దానిపై మంత్రివర్గ ఉపసంఘంలో చర్చించిన అనంతరం స్పష్టత రావచ్చని చెబుతున్నారు.
ఇవీ కమిషన్ అధికారాలు : కమిషన్‌కు విద్యా ప్రమాణాలను పరిరక్షించడం, ఫీజుల నియంత్రణ, ఉపాధ్యాయుల సామర్థ్యాలను పెంపొందించడం, పాఠశాలల పర్యవేక్షణ, తనిఖీలు, ప్రైవేటు పాఠశాలల్లో విద్యాహక్కు చట్టం అమలు చేయడం లాంటి అధికారాలు ఉంటాయి. కమిషన్ ఛైర్మన్‌గా హైకోర్టు, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి అధికారిగా ఉంటారు. కలెక్టర్ల అధ్యక్షతన జిల్లా ఫీజుల నియంత్రణకు కమిటీలు ఏర్పాటు చేసి వారే ఫీజులను నిర్ణయిస్తారు. ప్రతి సంవత్సరం వినియోగదారుల ధరల సూచిక(సీపీఐ) ఆధారంగా ఫీజులను పెంచుకునేలా తెలంగాణ విద్యా కమిషన్ ప్రభుత్వానికి ముసాయిదా బిల్లులో సిఫారసు చేసింది.
హడలెత్తిస్తున్న బీటెక్ ఫీజులు - ఈసారి ఏకంగా రూ.2 లక్షల పైనే!
స్కూల్ ఫీజులు ఏడాదికోసారి పెంచుకోవచ్చు! - విద్యా కమిషన్ సిఫార్సులు