పారాలింపిక్స్‌లో భారత్ జోరు- ఒక్కరోజే గోల్డ్ సహా 7 పతకాలు- మొత్తం ఎన్నంటే? - Paris Paralympics India 2024
Paris Paralympics India 2024: పారిస్ పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. సోమవారం ఒక్క రోజే భారత్ ఖాతాలో 7 పతకాలు చేరాయి. దీంతో ప్రస్తుత పారాలింపిక్స్‌లో భారత్ పతకాల సంఖ్య 14కు చేరింది.
Paris Paralympics India (Source: Associated Press (Left), Getty Images (Right))
Paris Paralympics India 2024:పారిస్ పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో సుహాస్ యతిరాజ్ రజతం దక్కించుకున్నాడు. సోమవారం జరిగిన ఫైనల్లో లుకస్ మజుర్ (ఫ్రాన్స్) చేతిలో 9-21 13-21 తేడాతో ఓడి సిల్వర్‌తో సరిపెట్టుకున్నాడు. ఇక టోక్యోలో కూడా సిల్వర్ సాధించిన యతిరాజ్, తాజాగా పారిస్‌లోనూ రజతంతో మెరిశాడు. దీంతో బ్యాడ్మింటన్‌లో రెండు పతకాలు సాధించిన తొలి పారా అథ్లెట్‌గా రికార్డు సృష్టించాడు. ఈ పతకాలతో ప్రస్తుత పారాలింపిక్స్‌లో భారత్ మెడల్స్ సంఖ్య 14కు చేరింది.
కాగా, సోమవారం భారత పారా అథ్లెట్లు అదరగొట్టారు. ఈ ఒక్క రోజే ఆయా క్రీడాంశాల్లో భారత్‌కు స్వర్ణం సహా 7 పతకాలు దక్కాయి. అందులో 2 పసిడి, 3 రజతం, 2 కాంస్య పతకాలు ఉన్నాయి. మరి ఎవరెవరు ఏయే విభాగాల్లో పతకాలు సాధించారంటే?
సోమవారం భారత్ పతకాలు
గోల్డ్: పారా అథ్లెట్ నితేశ్ కుమార్ పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో SL3లో గోల్డ్ మెడల్ దక్కించుకున్నాడు. బ్రిటన్ అథ్లెట్‌తో సోమవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో నితేశ్ 21-14, 18- 21, 23-21 తేడాతో నెగ్గాడు. అతడితో పాటు మెన్స్ జావెలిన్ త్రో F64లో సుమిత్ అంతిల్ స్వర్ణ పతకాన్ని సాధించాడు. దీంతో ప్రస్తుత పారాలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మూడు స్వర్ణాలు చేరాయి.
సిల్వర్: యోగేశ్ కుతునియా డిస్కస్ త్రోవర్ విభాగంలో రజతం ముద్దాడాడు. డిస్కస్ త్రోవర్ F56 విభాగంలో పోటీ పడ్డ యోగేశ్ 42.22 మీటర్ల ప్రదర్శనతో రెండో స్థానంలో నిలిచాడు. ఈ సీజన్లో యోగేశ్‌కు ఇదే అత్యత్తమ ప్రదర్శన. కాగా, పారాలింపిక్స్‌లో సిల్వర్ దక్కించుకోవడం ఇది వరుసగా రెండోసారి. 2020 టోక్యోలోనూ అతడు రజతం ముద్దాడాడు.
తులసీమతి మురుగేశన్ మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ (SU5) ఈవెంట్లో రజతంతో సత్తా చాటింది. గోల్డ్ మెడల్ మ్యాచ్‌లో తులసిమతి 17-21, 10-21తో యాంగ్ క్విక్సియా (చైనా) చేతిలో ఓడి సిల్వర్‌తో సరిపెట్టుకుంది. కాగా, మురుగేశన్కు ఇదే తొలి పారాలింపిక్స్ పతకం కావడం విశేషం.
కాంస్యం: మరోవైపు ఇదే ఈవెంట్ ఫైనల్ కంటే కాస్త ముందు మనీశా రామ్‌దాస్ కాంస్యం ముద్దాడింది. కాంస్య పోరులో మనీశా 21-12, 21-8 వరుస సెట్లలో ఆధిక్యం ప్రదర్శించి పతకం దక్కించుకుంది. ఈ క్రమంలో పారాలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ విభాగంలో పతకం సాధించిన తొలి మహిళా పారా అథ్లెట్‌గా మనీషా రికార్డు సృష్టించింది. ఇక ఆర్చరీ మిక్స్డ్ టీమ్ కాంపౌండ్ ఓపెన్‌లో పారా ఆర్చర్ జోడీ శీతల్ దేవీ, రాకేశ్ కూమార్ కాంస్య పతకాన్ని సాధించారు.