Pravin Amre On Prithvi Shaw : టీమ్ఇండియా యువ క్రికెటర్ పృథ్వీ షా కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. అతడు జాతీయ జట్టుకు దురమై చాలా 4ఏళ్లు దాటిపోయింది! ఇక రీసెంట్గా జరిగిన మెగా వేలంలోనూ అతడిని కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ కూడా ఆసక్తి కనబర్చలేదు. రూ.75 లక్షల బేస్ ప్రైజ్‌తో వేలంలోకి వచ్చిన షా అన్లోల్డ్గా మిగిలిపోయాడు. అయితే యంగ్ ప్లేయర్ షా కెరీర్లో ఎదుర్కొంటున్న ఇబ్బందులపై మాజీ క్రికెటర్ ప్రవీణ్ ఆమ్రే తాజాగా మాట్లాడాడు. చిన్న వయసులో వచ్చిన పేరు, ప్రతిష్ఠలు కాపాడుకోకపోవడమే ఈ పరిస్థితికి కారణం అయ్యి ఉండవచ్చని అభిప్రాయపడ్డాడు.
'మూడేళ్ల కిందట వినోద్ కాంబ్లీ గురించి చెప్పాను. నేను కాంబ్లీ పతనాన్ని దగ్గరి నుంచి చూశాను. ఈ తరం కుర్రాళ్లకు కొన్ని విషయాలు నేర్పించడం సులువు కాదు. పృథ్వీ 23 ఏళ్లకే రూ.34- 40కోట్లు సంపాదించి ఉంటాడు. ఓ IIM గ్రాడ్యుయేట్ కూడా అంత సంపాదించరేమో! చిన్న వయసులో అంత మొత్తంలో సంపాదించినప్పుడు తప్పకుండ దృష్టి మరలే అవకాశం ఉంటుంది. అందుకే క్రికెట్‌కు ప్రాధాన్యం ఇవ్వడమే కాదు మంచి స్నేహితులు, డబ్బును ఎలా మేనేజ్ చేయాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
షా జీవితం భారత క్రికెట్‌లో ఒక కేస్ స్టడీ. అతడికి జరిగింది ఇంకెవరికీ జరగకూడదు. టాలెంట్ మాత్రమే ఒక్కటే ఉన్నతస్థాయికి తీసుకెళ్లదు. క్రమశిక్షణ, సంకల్పం, అంకితభావం అనేవి మనిషికి చాలా ముఖ్యం. తనను ఐపీఎల్లో దిల్లీ ఫ్రాంచైజీ కొనుగోలు చేసినప్పుడు, అతడు టీమ్ఇండియా అండర్- 19 జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అతడిపై నమ్మకం ఉంచిన దిల్లీ యాజమాన్యం 6ఏళ్ల పాటు పృథ్వీకి మద్దతుగా నిలిచింది. కానీ, క్రమశిక్షణగా లేకపోవడమే అతడి కెరీర్‌ను దెబ్బతీసింది. పృథ్వీని దిల్లీ జట్టు వదులుకోవడం శిక్ష కాదు. అతడు సరైన మార్గంలో రావాలనే మేం కోరుకున్నాం. అతడు ఈ వేలంలో ఎదుర్కొన్న పరిస్థితిని పాజిటివ్‌గా తీసుకుంటాడని ఆశిస్తున్నా. అతడికి ఇంకా చాలా వయసు ఉంది' అని ఆమ్రే ఆశాభావం వ్యక్తం చేశాడు.
యంగ్ టాలెంటెడ్ పృథ్వీ 18ఏళ్లకే భారత టెస్టు జట్టులో అరంగేట్రం చేశాడు. కానీ, టీనేజీలోనే వచ్చిన పేరు ప్రఖ్యాతలు, డబ్బు అతడిని దెబ్బతీశాయి. ఐపీఎల్‌లోనూ దిల్లీ జట్టులో అనేక అవకాశాలు వచ్చాయి. అయినా ఆ అవకాశాలు అందిపుచ్చుకోవడంలో షా విఫలమయ్యాడు. గతరెండు సీజన్లుగా ఐపీఎల్లో షా ప్రదర్శన కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. దీంతో రీసెంట్ మెగా వేలంలో అతడిని కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంచైజీ ముందుకు రాలేదు.