Vinesh Phogat Retirement : పారిస్ ఒలింపిక్స్ 2024లో అనర్హత వేటు వల్ల పతకాన్ని చేజార్చుకున్న స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ ఆ తర్వాత ఆటకు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆమె తన రిటైర్‌మెంట్‌ను వెనక్కి తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆమె ఎక్స్‌లో ఓ సుదీర్ఘ ఎమోషనల్ పోస్ట్ ద్వారా ఈ విషయాన్ని అన్యాపదేశంగా వెల్లడించింది. అలాగే తన వెన్నంటే ఉండి మద్దతు ఇచ్చిన దేశప్రజలకు, సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. చివరి వరకు సాయశక్తులా కృషి చేశానని, ప్రత్యర్థులకు లొంగిపోలేదని పేర్కొంది.
"మీ అందరికి ఓ విషయం చెప్పాలని అనుకుంటున్నాను. నా పోరాటాన్ని ఇక్కడితో ఆపను. అనుకున్నది సాధించేందుకు సాయశక్తులా కష్టపడ్డాను. ప్రత్యర్థులకు లొంగిపోలేదు. కానీ ప్రస్తుతం కాలం కలిసి రాలేదు. విధి వక్రించింది. అందుకే నేను వెనుదిరిగాల్సి వచ్చింది. నా భవిష్యత్ ఏంటో ఇంకా నాకు పూర్తిగా తెలీదు. వాస్తవానికి 2032 వరకు నేను కుస్తీ ఆడగలనని భావించాను. కానీ నేను నమ్ముకున్న దాని గురించి, నిరంతరం పోరాడుతూనే ఉంటాను." అని రాసుకొచ్చింది.
అలానే కోచ్ వోలర్, తమ జట్టు వైద్యుడు దిన్షా పర్థీవాలాపై ప్రశంసలు కురిపించిన వినేశ్, వారి పట్టుదల వల్లే తాను ఒలింపిక్స్‌కు వెళ్లగలిగానని చెప్పింది. వారికి కృతజ్ఞతలు తెలిపింది.