Paris Olympics India House: పారిస్ ఒలింపిక్స్‌లో ఏర్పాటు చేసిన 'ఇండియా హౌజ్'ను కాంస్య పతక విజేత సరబ్జోత్ సింగ్ సహా పలువురు భారత అథ్లెట్లు తాజాగా సందర్శించారు. భారత సంప్రదాయ బ్యాండ్ చప్పుళ్లు, నృత్యాలు ఫ్యాన్స్ కేరింతల మధ్య అథ్లెట్లకు ఇండియన్ హౌజ్‌లో ఘన స్వాగతం దక్కింది. వీరికి ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ మెంబర్, రిలయన్స్ ఛైర్పర్సన్ నీతా తిలకం దిద్ది అంబానీ స్వాగతం పలికారు. అనంతరం అథ్లెట్లను నీతా అంబానీ సన్మానించారు. ముఖ్యంగా భారత్‌కు పతకాలు సాధించిన మనూ బాకర్, సరబ్జోత్ సింగ్‌ను నీతా అంబానీ అభినందించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. 'ఇండియా హౌజ్‌లోకి మీకు (అథ్లెట్లకు) స్వాగతం. ఈ విశ్వ క్రీడల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది. మీరంతా నేడు, రేపు, ఎప్పటికీ భారత ఐకాన్లు. ఈ ఒలింపిక్స్‌లో కాంస్యం ముద్దాడిన మనూ బాకర్, సరబ్‌జోత్‌కు నా అభినందనలు' అని నీతా అన్నారు. తర్వాత అథ్లెట్లను సన్మానించి వారితో గ్రూప్ ఫొటో తీసుకున్నారు. ఇందులో టెన్నిస్ దిగ్గజం రోహన్ బోపన్న, శరత్ కమల్, మనికా బాత్ర, అర్జున్ బబుతా తదితర అథ్లెట్లు పాల్గొన్నారు.
అసలేంటీ ఇండియా హౌజ్:ఒలింపిక్స్ జరుగుతున్న పారిస్‌లో ఇండియా హౌజ్ ఏర్పాటైంది. ఇది ఇండియా ఫ్యాన్స్, అథ్లెట్లకు పెవిలియన్‌గా ఉంటుంది. ఒలింపిక్స్ హిస్టరీలో తొలిసారి భారత్ ఈ కంట్రీ హౌజ్‌ను ఏర్పాటు చేసింది. ఈ వేదికగా ఒలింపిక్స్ లైవ్ స్ట్రీమింగ్ కూడా చూడవచ్చు.