Paris Olympics 2024 Record Tickets :మరికొన్ని గంటల్లోనే క్రీడల మహా సంగ్రామం పారిస్ వేదికగా ప్రారంభం కానుంది. ఇప్పటికే అతిరథ మహారథులు ఫ్రాన్స్ రాజధాని చేరుకున్నారు. అతిథులు, పర్యాటకుల రాకతో ఫ్రాన్స్ రాజధాని కిటకిటలాడుతోంది. అయితే పారిస్ ఒలింపిక్స్ 2024లో గతంలో ఎప్పుడూ లేనంత ఎక్కువగా టికెట్లు అమ్ముడైనట్టు ఒలింపిక్స్ నిర్వాహకులు ప్రకటించారు. చరిత్రలో అత్యధిక సంఖ్యలో టిక్కెట్లు విక్రయించిన ఒలింపిక్స్‌గా పారిస్ విశ్వ క్రీడలు రికార్డు సృష్టించాయని పేర్కొన్నారు. మిలియన్ల సంఖ్యలో టికెట్లు అమ్ముడు పోయినా ఇంకా టిక్కెట్లు అందుబాటులో ఉన్నట్లు ఒలింపిక్స్ నిర్వహణ కమిటీ వెల్లడించింది.
రికార్డు స్థాయిలో -ఈ ఏడాది ఒలింపిక్, పారాలింపిక్ క్రీడలకు 9.7 మిలియన్ టిక్కెట్లు అమ్ముడయ్యాయని ఒలింపిక్స్ నిర్వాహకులు తెలిపారు. పారిస్ ఒలింపిక్స్ కోసం మొత్తం 10 మిలియన్ టిక్కెట్లు అమ్మకానికి సిద్ధంగా ఉంచగా ఇప్పటికే అధిక శాతం టికెట్లను అభిమానులు కొనుగోలు చేశారని వెల్లడించారు. ఒలింపిక్స్‌లో ఇంతకుముందు ఏ ఒలింపిక్స్ గేమ్స్‌కు ఇంతటి ప్రజాదరణ దక్కలేదని అన్నారు. గత ఒలింపిక్స్ సమయంలో కరోనా మహమ్మారి కారణంగా జనాదరణ దక్కలేదని ఈసారి మాత్రం భారీగా టికెట్లు అమ్ముడయ్యాయని నిర్వాహకులు చెప్పారు.
టికెట్లు భారీగా అమ్ముడుపోయినా ఇంకా చాలా ఖాళీలు మిగిలి ఉన్నట్లు తేలడంతో మరిన్ని టికెట్లను అందుబాటులో ఉంచాలని నిర్వాహకులు చూస్తున్నట్లు సమాచారం. మరోవైపు పారిస్‌లో నిజమైన సందడి ఇప్పుడే ఆరంభమైందని, అభిమానులు ఒక్కొక్కరు ఒలింపిక్ నగరానికి చేరుకుంటున్నారని తెలిసింది.