Paris Olympics 2024 :ఈ ఇద్దరి అభిరుచులు వేర్వేరు.ఆమెకేమో గుర్రపు స్వారి చేయడం, వయోలిన్ వాయించడం, బొమ్మలు గీయడం ఇష్టం. ఇక అతనికేమో రేస్ కార్లను ట్రాక్‌పై పరుగులు పెట్టించడం, హుషారైన పంజాబీ పాటలు వినడం ఇంట్రెస్ట్. ఇలా భిన్న ధ్రువాల్లాంటి ఈ ఇద్దరూ దేశం కోసం శ్రమించి పతకాన్ని సాధించారు. వారే మను బాకర్, సరబ్‌జోత్ సింగ్.
బాక్సింగ్, టెన్నిస్, స్కేటింగ్ ఇలా వివిధ క్రీడల్లో పట్టు సాధించినప్పటికీ, షూటింగ్‌పైనే మనసు పారేసుకుంది మను. ఇక సరబ్‌జ్యోత్‌ల కూడా తనకిష్టమైన ఫుట్‌బాల్‌ను తుపాకీ పట్టుకున్నాడు. టోక్యో ఒలింపిక్స్‌లోని అనుభవంతో మను, అలాగే తొలిసారి ఒలింపిక్స్ బరిలో దిగిన ఉత్సాహంతో సరబ్‌జ్యోత్ ఈ ఇద్దరూ కలిసి మిక్స్‌డ్ విభాగంలో రాణించారు. ఒకరు వెనుకబడ్డా కూడా మరొకరు మెరుగైన ఫామ్ కనబరిచి విజయతీరాలకు చేరుకున్నారు.
తాజాగా జరిగిన కాంస్య పోరులో కొన్ని షాట్లలో సరబ్‌జోత్ 8.6, 9.6, 9.4 స్కోరు చేస్తే, దాన్ని బ్యాలెన్స్ చేసేందుకు మను (10.2, 10.5, 10.6) ముందుకొచ్చింది. చివరిలో మను 9.6, 9.4 చేస్తే, సరబ్‌జోత్ 9.7, 10.2తో విజయాన్ని అందించాడు. మిక్స్‌డ్ టీమ్‌లో వీళ్లిద్దరు కలిసి గెలిచిన తొలి పతకం ఇదే. ఆసియా క్రీడలు, ప్రపంచకప్‌లో దివ్యతో కలిసి సరబ్‌జోత్ స్వర్ణాలు నెగ్గాడు.