Paris Olympics 2024 Day 3 India:పారిస్ ఒలింపిక్స్ 2024లో మూడోరోజు కూడా భారత్‌కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. షూటింగ్ విభాగంలో 10మీటర్ల మిక్స్డ్ డబుల్స్ ఈవెంట్లో మనూ బాకర్- సరబ్‌జోత్ సింగ్ జోడీ రాణించింది. క్వాలిఫికేషన్ రౌండ్లో 3వ స్థానం దక్కించుకున్నారు. దీంతో కాంస్య పతక పోరుకు అర్హత సాధించారు. మంగళవారం (జులై 30) మధ్యాహ్నం 1.00 గంటలకు మను- సబర్జోత్ 10మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ ఆడనున్నారు. ఇక మూడోరోజు ఎవరెవరు ఏయే ఈవెంట్లలో పాల్గొన్నారంటే?
ఫైనల్‌లో నిరాశ
10మీటర్ల ఎయిర్ రైఫిల్ మహిళల సింగిల్స్ ఫైనల్ ఈవెంట్లో షూటర్ రమితా జిందాల్‌కు నిరాశే ఎదురైంది. హోరాహోరీగా సాగిన పతక పోరులో జిందాల్ 7వ స్థానానికి పరిమితమైంది. మరోవైపు ఇదే ఈవెంట్ పురుషుల సింగిల్స్ ఫైనల్‌లో అర్జున్ బబుతాకు కూడా పరాభవం ఎదురైంది. చివరి దాకా గట్టి పోటీ ఇచ్చిన అర్జున్ తృటిలో పతకాన్ని చేజార్చుకున్నాడు. ఈ ఈవెంట్లో అర్జున్ స్వల్ప తేడాతో 4వ స్థానానికే పరిమితమయ్యాడు. దీంతో పతకం ఆశలు ఆవిరయ్యాయి. లేదంటే ఈరోజే భారత్ ఖాతాలో మరో పతకం చేరేదే!
బ్యాడ్మింటన్‌లో మిశ్రమ ఫలితాలు
భారత జోడీ అశ్విని పొన్నప్ప- తానిషా క్రాస్టో ఈ విశ్వ క్రీడల్లో వరుసగా రెండోసారి ఓటమి పాలయ్యారు. సోమవారం జరిగిన మహిళల బ్యాడ్మింటన్ డబుల్స్‌లో జపాన్‌కు చెందిన నమీ మత్సుయామా- చిహారు షిదా చేతిలో ఓడారు. 21-11 21-12 పాయింట్ల తేడాతో భారత ద్వయం ఓటమిపాలైంది. దీంతో ఈ విభాగం నుంచి నిష్క్రమించారు.
సాత్విక్- చిరాగ్ అదుర్స్
భారత స్టార్ జోడీ సాత్విక్- చిరాగ్ శెట్టి జోడీ పారిస్ ఒలింపిక్స్‌లో వాక్ఓవర్లో నెగ్గింది. ప్రత్యర్థి పోటీ నుంచి తప్పుకోవడం వల్ల సాత్విక్- చిరాగ్ విజేతలుగా ఎంపికయ్యారు. దీంతో ఈ ద్వయం క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. కాగా, ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ డబుల్స్ విభాగంలో క్వార్టర్స్‌కు చేరిన తొలి జోడీగా రికార్డు కొట్టింది. ఇక జూలై 30న ఇండోనేసియా జోడీతో భారత్ ద్వయం తలపడనుంది.