తెలంగాణ

telangana

ETV Bharat / sports

పాకిస్థాన్ సంచలనం - సొంత గడ్డపై 1348 రోజుల తర్వాత భారీ విజయం! - PAK VS ENG 2ND TEST

సొంత గడ్డపై పాక్ సంచలనం - 1,348 రోజుల తర్వాత అక్కడ తొలి విజయం!

Pakistan Vs England 2nd Test
Pakistan Vs England 2nd Test (Associated Press)

By ETV Bharat Sports Team

Published : Oct 18, 2024, 1:22 PM IST

Pakistan Vs England 2nd Test :సొంతగడ్డపై తాజాగా పాకిస్థాన్‌ జట్టు అరుదైన రికార్డును నమోదు చేసింది. ఆ వేదికగా తాజాగా జరిగిన రెండో టెస్టులో ఇంగ్లాండ్ జట్టును​ 152 పరుగుల తేడాతో చిత్తు చేసి గెలిచింది. పాక్ నిర్దేశించిన 297 పరుగుల లక్ష్యాన్ని చేరుకోలేక ఇంగ్లాండ్ జట్టు 144 పరుగులకే చతికిలపడింది. నొమన్ అలీ (8/46), సాజిద్ ఖాన్ (2/93) దెబ్బకు ఇంగ్లాండ్ పని అయిపోయింది. ఇంగ్లీష్ జట్టు నుంచి కెప్టెన్ బెన్ స్టోక్స్ (37) తప్ప మిగతవారంతా తక్కువ స్కోర్​కే పరిమితమైపోయారు. బ్రైడన్ కార్సె (27), ఓలీ పోప్ (22), జో రూట్ (18), హ్యారీ బ్రూక్ (16) ఆశించిన మేర రాణించలేకపోయారు.

మ్యాచ్ ఎలా జరిగిందంటే :
తొలి ఇన్నింగ్స్‌లో పాక్‌ 366 పరుగులు చేయగా, ఇంగ్లాండ్​ 291 పరుగులు స్కోర్ చేసింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్ 221 పరుగులు నమోదు చేసింది. ఈ విజయంతో రెండు టెస్టుల సిరీస్‌ 1-1తో సమంగా నిలిచింది. బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల సిరీస్‌ను కోల్పోయిన పాక్‌కు ఇప్పుడీ సిరీస్‌ సమం కావడం పెద్ద ఊరటగా అనిపిస్తోంది. తొలి టెస్టులో ఘోర ఓటమిని చవిచూసిన సంగతి తెలిసిందే. అయితే రెండో టెస్టులో పుంజుకున్న తీరు అద్భుతమం అని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఆ ఇద్దరే పడగొట్టారు!
ఇంగ్లాండ్‌తో రెండో టెస్టులో పాకిస్థాన్‌ స్పిన్నర్లు అదరగొట్టారు. నొమన్, సాజిద్ ప్రత్యర్థికి చెందిన 20 వికెట్లను తమ ఖాతాలో వేసుకున్నారు. మొదటి ఇన్నింగ్స్‌లో సాజిద్ ఏడు వికెట్లు తీయగా, ఆ తర్వాతి ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు పడగొట్టారు. ఇక నొమన్ అలీ మొదటి ఇన్నింగ్స్‌లో 3, రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా 8 వికెట్లు పడగొట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే బజ్‌బాల్ క్రికెట్ ఆడే ఇంగ్లాండ్ జట్టుకు కేవలం ఇద్దరు స్పిన్నర్లే అడ్డుకట్ట వేయడం 1987 తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం. టెస్టు చరిత్రలో ఒక మ్యాచ్‌లో ఇద్దరు బౌలర్లే మొత్తం 20 వికెట్లు తీయడం ఇది ఏడోసారి.

2021లో చివరి విజయం
పాకిస్థాన్‌కు సొంతగడ్డపై టెస్టు విజయం దక్కి దాదాపు 1,350 రోజులు అవుతోంది. 2021లో ఈ జట్టు చివరిసారిగా దక్షిణాఫ్రికాపై గెలుపొందింది. ఆ తర్వాత ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేకపోయింది. ఇప్పుడు ఇంగ్లండ్‌పై విజయంతో ఆ నిరీక్షణకు తెరదించనట్లు అయ్యింది. ఇక స్వదేశంలో వరుసగా 11 ఓటముల పరంపరకు ముగింపు లభించింది.

WTC టేబుల్​లో కిందకి పడిపోయిన పాక్ - మరి భారత్ స్థానం ఎంతంటే?

తొలి టెస్టులో ఇంగ్లాండ్ భారీ విజయం- పాక్ ఖాతాలో అత్యంత చెత్త రికార్డు

ABOUT THE AUTHOR

...view details