IND vs PAK Match Less Tickets : క్రికెట్‌లో భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ దాయాదుల మధ్య పోరు ప్రపంచంలో ఎక్కడ జరిగినా మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లు భారీ స్థాయిలో అమ్ముడుపోతుంటాయి. చూస్తుండంగానే క్షణాల్లోనే హాట్ కేకుల్లా అయిపోతుంటాయి. అందుకు తగ్గట్టే భారీ సంఖ్యలో అభిమానులు స్టేడియానికి తరలివస్తుంటారు. అయితే ఓ సారి మాత్రం భారత్ - పాక్ మ్యాచ్‌కు ఊహించని సంఘటన ఎదురైంది. అతి తక్కువ మంది ప్రేక్షకులు మాత్రమే ఈ దాయాదుల పోరుకు హాజరయ్యారు. 28 ఏళ్ల క్రితం ఈ సంఘటన జరిగింది.
ఎందుకంటే? - ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా కెనడాలోని టొరంటో వేదికగా సెప్టెంబర్ 16, 1996న భారత్, పాకిస్థాన్ మధ్య వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌కు వర్షం తీవ్ర అంతరాయం కలిగించింది. దీంతో 750 మంది ప్రేక్షకులు మాత్రమే స్టేడియానికి హాజరై మ్యాచ్‌ను వీక్షించారు. దాయాదుల మధ్య జరిగిన పోరుకు ఇంత తక్కువ మంది ప్రేక్షకులు హాజరు అవ్వడం బహుశ ఇదే మొదటి సారి కావొచ్చు.
కుదించిన మ్యాచ్ - వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 33 ఓవర్లకు కుదించారు. ఈ పోరులో మొదట బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ 9 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది. సయీద్ అన్వర్ (46) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. జవగళ్ శ్రీనాథ్, అనిల్ కుంబ్లే తలో మూడు వికెట్లు తీయగా, వెంకటేశ్ ప్రసాద్ 2 వికెట్లు తీశాడు.