Ohja On Iyer Comeback Practice:టీమ్ఇండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ కొంతకాలంగా రెడ్ బాల్ (టెస్టుల్లో) క్రికెట్లో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయడం లేదు. రీసెంట్గా ముగిసిన సౌతాఫ్రికా టెస్టు సిరీస్‌లో 4 ఇన్నింగ్స్‌లో అయ్యర్ 41 పరుగులు మాత్రమే. అయినప్పటికీ ప్రస్తుతం జరుగుతున్న ఇంగ్లాండ్ సిరీస్‌కు కూడా అయ్యర్ ఎంపికయ్యాడు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సిరీస్ నుంచి తప్పుకోవడం వల్ల అయ్యర్‌కు తుది జట్టులో స్థానం దక్కింది.
స్వదేశంలోనైనా ఇంగ్లాండ్‌పై మెరుగ్గా రాణిస్తాడనుకుంటే వరుసగా విఫలమౌతున్నాడు. ఇంగ్లాండ్‌పై తొలి రెండు టెస్టుల్లో నాలుగు ఇన్నింగ్స్‌ల్లో అయ్యర్ 104 (35, 13, 27, 29) పరుగులు చేశాడు. దీంతో అతడి స్థానాన్ని వేరే ప్లేయర్ల్తో భర్తీ చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీమ్ఇండియా మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా అయ్యర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అయ్యర్ డొమెస్టిక్ టోర్నీల్లో ఆడి, కొన్ని పరుగులు సాధించాల్సిందిగా సలహా ఇచ్చాడు.
'శ్రేయస్ అయ్యర్ ఆటపరంగా కాస్త వెనకబడ్డాడు. ఒకవేళ తదుపరి మ్యాచ్‌లకు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ తిరిగి వస్తే, వాళ్లకు కచ్చితంగా తది జట్టులో చోటు ఉంటుంది. అందుకే అయ్యర్, జట్టులో స్థానం కోల్పోవచ్చు. అంటే అతడికి అవకాశాలు ఇవ్వకూడదని కాదు. అద్భుతంగా ఆడేవారు వచ్చినప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎదురౌవుతాయి. అందుకే అయ్యర్ డొమెస్టిక్ క్రికెట్ ఆడి కొన్ని పరుగులు సాధిస్తే బెటర్' అని ఓజా అన్నాడు.