Nitish Kumar Reddy Interview : టీమ్ఇండియా యంగ్ క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి తాజాగా తన ఫ్యామిలీ గురించి తలుచుకుని ఎమోషనల్ అయ్యాడు. తన క్రికెట్ కెరీర్ గురించి మాట్లాడిన అతడు, తాను ఈ పొజిషన్లో ఉండటానికి కారణం తన తండ్రి చేసిన త్యాగం వల్లేనని నితీశ్ వెల్లడించాడు. ఆస్ట్రేలియా టెస్టు నేపథ్యంలో నితీశ్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
"చిన్నప్పుడు నేను క్రికెట్‌ను అంత సీరియస్‌గా తీసుకోలేదు. అయితే నా కోసం మా నాన్న ఉద్యోగాన్ని వదిలేశారు. అలా నేనిలా క్రికెటర్‌గా మారేందుకు ఆయన చేసిన త్యాగాలే కారణం. ఆర్థిక సమస్యల కారణంగా ఒకానొక సమయంలో మా నాన్న ఏడవటాన్ని నేను చూశాను. మేం ఎదుర్కొన్న కష్టాలు, అలాగే మా నాన్న త్యాగం ముందు నేను పడే ఈ శ్రమ ఎంతో తక్కువే. అప్పటినుంచే నేను ఈ క్రీడపై సీరియస్‌గా ఫోకస్ పెట్టాను. ఓ ప్లేయర్‌గా నిరంతరం నన్ను నేను మెరుగు పర్చుకునేందుకు ఎంతో కష్టపడేవాడిని. దానికి ఇప్పుడు ప్రతిఫలం దక్కింది. ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన కుమారుడిగా మా నాన్నను సంతోషంగా ఉంచుతున్నందుకు నేనెంతో గర్వపడుతున్నాను. నా ఫస్ట్ జెర్సీని ఆయనకే ఇచ్చాను. అప్పుడు మా నాన్న ముఖంలో కనిపించిన ఆనందాన్ని నేనెప్పటికీ మరిచిపోలేను. నేను ఏదో సాధించానని అప్పుడే గర్వపడ్డాను" అని నితీశ్ ఎమోషనల్ అయ్యాడు.
విరాట్‌తో ఆడాలనే లక్ష్యం!
అయితే ఇటీవల ఓ ఇంటర్య్వూలో తన కుమారుడి కష్టంపై నితీశ్ తండ్రి ముత్యాలరెడ్డి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విరాట్ కోహ్లీని చూస్తూ పెరిగిన నితీశ్, ఎప్పటికైనా అతడితో కలిసి ఆడాలనే లక్ష్యంతో ఉండేవాడంటూ ఆయన పేర్కొన్నారు. తన ఆరాధ్య క్రికెటర్ నుంచే డెబ్యూ క్యాప్‌ను అందుకోవడం నితీశ్ కష్టానికి ప్రతిఫలమని ఆయన వ్యాఖ్యానించారు.