Nitish Kumar Reddy Border Gavaskar Trophy : ప్రతిష్టాత్మక బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో తాజాగా తెలుగు కుర్రాడు నితీశ్‌కుమార్ రెడ్డి విజృంభించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అతడి అద్భుతమైన ఆటతీరుతో ఏకంగా శతకం బాది ఔరా అనిపించాడు. క్లిష్ట సమయాల్లో ఆ జట్టును గట్టెక్కించాడు. మెల్‌బోర్న్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి 189 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 114 రన్స్ స్కోర్ చేశాడు. ఈ క్రమంలో అతడిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. తాజాగా నితీశ్ జీనియస్ అని, ఏ ఆస్ట్రేలియన్ బౌలర్‌కూ భయపడలేదంటూ ఆస్ట్రేలియా జట్టు మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ నితీశ్‌ను పొగడ్తలతో ముంచెత్తాడు.
"ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ చేస్తున్న ఈ కుర్రాడు ఓ జీనియస్. ఈ సిరీస్‌లో ఎక్స్పెక్టేషన్స్ లేకుండానే బరిలోకి దిగి రాణిస్తున్నాడు. 21 ఏళ్ల వయసులోనే అతను టీమ్‌ఇండియాకు ప్రధాన బ్యాటర్‌లా మారిపోయాడు. ఏ ఆస్ట్రేలియన్ బౌలర్‌కూ నితీశ్ అస్సలు భయపడలేదు. ఓపికగా ఉండాల్సిన సమయంలోనూ తన ఓర్పుగా ఉన్నాడు. టెయిలెండర్లతో కలిసి అతడు బాగా బ్యాటింగ్ చేశాడు. అలా తన ఉద్దేశాన్ని చాటాడు. బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్ కూడా బాగా చేస్తాడు. అయితే నితీశ్ ఆరో స్థానానికి సరిగ్గా సరిపోతాడని నా అభిప్రాయం. ఆసీస్‌తో చివరి టెస్టులో భారత్‌కు అతను ఎంతో కీలకం కానున్నాడు" అని మైఖేల్ క్లార్క్ నితీశ్‌ను కొనియాడాడు.
ఇక, మెల్‌బోర్న్ టెస్టులో విజయంతో సిరీస్‌లో ఆస్ట్రేలియా జట్టు 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఐదో (చివరి) టెస్టు జనవరి 3 నుంచి సిడ్నీ వేదికగా ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను 2-2తో సమం చేయాలని టీమ్ఇండియా పట్టుదలతో ఉంది.