Virat Kohli Ranji Trophy : టీమ్ఇండియా రన్నింగ్ మెషిన్ విరాట్ కోహ్లీ 13 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీలో బరిలో దిగనున్నాడు. గతకొంతకాలంగా ఫామ్ లేమితో సతమతమవుతున్న ఈ స్టార్ క్రికెటర్, తన పెర్ఫామెన్స్‌ను మెరుగుపరుచుకునేందుకు సిద్ధమయ్యాడు. 2012లో చివరగా రంజీ మ్యాచ్ ఆడాడు. మళ్లీ ఇన్నేళ్లకు ఇప్పుడు ఈ ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీలో ఆడనున్నాడు.
ఇక జనవరి 30 నుంచి రైల్వేస్‌తో జరగనున్న చివరి లీగ్ మ్యాచ్‌లో దిల్లీ తరఫున బరిలోకి దిగనున్నాడు. అంతకుముందు జనవరి 23 నుంచి దిల్లీ, సౌరాష్ట్ర మ్యాచ్ మొదలవనుంది. అయితే మెడనొప్పి కారణంగా విరాట్ ఈ మ్యాచ్ ఆడట్లేదు. కానీ రైల్వేస్‌తో మ్యాచ్‌కు మాత్రం అందుబాటులో ఉంటానంటూ దిల్లీ క్రికెట్ అసోసియేషన్‌కు సమాచారం అందించాడు. దిల్లీ టీమ్ హెడ్ కోచ్ శరణ్‌దీప్ సింగ్ తాజాగా ఓ ఇంటర్యూలో తెలిపారు.
మరోవైపు అంతర్జాతీయ మ్యాచ్‌లు లేని టైమ్‌లో అందుబాటులో ఉంటే ప్లేయర్లు తప్పకుండా దేశవాళీ లీగ్‌ల్లో ఆడాలని ఇటీవల బీసీసీఐ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో స్టార్ క్రికెటర్లకు మినహాయింపులు ఉండవని పేర్కొంది. దీంతో రోహిత్ శర్మతో పాటు రవీంద్ర జడేజా, రిషబ్ పంత్, శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ లాంటి ఆటగాళ్లు రంజీ ట్రోఫీలో ఆడనున్నారు.
ఘోర విఫలం
గతేడాది 10 టెస్టుల్లో విరాట్ కోహ్లీ 24.52 సగటుతో కేవలం 417 పరుగులు మాత్రమే చేశాడు. అందులో ఒక శతకం, ఒక హాఫ్ సెంచరీ ఉంది. ఓవరాల్ గా అన్ని ఫార్మాట్లలో కలిపి గతేడాది 32 ఇన్నింగ్స్ ల్లో 21.83 సగటుతో కేవలం 655 పరుగులు మాత్రమే చేసి విఫలమయ్యాడు.
కోహ్లీకి మద్దతుగా బంగర్
మరోవైపు, పేలవ ఫామ్‌తో ఇబ్బందిపడుతున్న కోహ్లీకి భారత మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ మద్దతుగా నిలిచాడు. కోహ్లీ మంచి ఫిట్నెస్తో ఉన్నాడని, అతడు మరికొన్నేళ్లు క్రికెట్ ఆడొచ్చని అభిప్రాయపడ్డాడు. "నేను ఇప్పటికీ కోహ్లీకి మద్దతు ఇస్తున్నాను. 36 ఏళ్ల వయసులో కూడా అతను ఎప్పటిలాగే ఫిట్‌గా ఉన్నాడు. అతని ఫిట్నెస్ స్థాయిలు అద్భుతంగా ఉన్నాయి." అని బంగర్ అన్నాడు.
'పుజారాలా విరాట్ కూడా కౌంటీల్లో ఆడాలి- అది తనకు ఎంతో అవసరం'