Meta Survey On Auto Sales : వాహన కంపెనీల వినియోగదారుల అభిరుచిపై ఆసక్తికర వివరాలతో ఒక శ్వేతపత్రం వెలువడింది. దీన్ని మెటా (ఫేస్‌బుక్), ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్లు సంయుక్తంగా రూపొందించాయి. అపర కుబేరుడు మార్క్ జుకర్‌బర్గ్‌కు చెందిన మెటా కంపెనీ సారథ్యంలో నిర్వహించిన ఈ సర్వేలో పలు కీలక వివరాలను గుర్తించారు.
సర్వే నివేదికలోని వివరాలివి!
- కొత్తగా వాహనం కొనాలని భావించే వారిలో 72 శాతం మంది ఆయా వాహన బ్రాండ్లను మెటా(ఫేస్‌బుక్)కు చెందిన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లలో చూసి ఆకర్షితులు అవుతున్నారు.
- వాట్సాప్ ద్వారా వినియోగదారులతో ఆయా వాహన డీలర్లు సులభంగా కమ్యూనికేట్ అవుతున్నారు. ఫలితంగా వినియోగదారుడితో బలమైన సంబంధం ఏర్పడుతోంది.
- తాము కొనాలని భావిస్తున్న వాహన మోడల్ అందుబాటులో ఉందా? లేదా? అనేది వాహన డీలర్ ద్వారా తెలుసుకునేందుకు కొనుగోలుదారులలో 48 శాతం వాట్సాప్‌నే వినియోగిస్తున్నారు.
- వాహన డీలర్ల నుంచి వాహన సర్వీసుల రిమైండర్లను వాట్సాప్‌లో పొందేందుకు తమకు అభ్యంతరమేమీ లేదని సర్వేలో పాల్గొన్న 47 శాతం మంది చెప్పారు.
- ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ సైతం వాహనాలపై నెటిజన్లకు ఆసక్తిని పెంచుతున్నాయి. వాటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనే ఆలోచనను రేకెత్తిస్తున్నాయి.
- వాహనాలపై రూపొందించే ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ సమాచారదాయకంగా ఉంటున్నాయని, వాహనం కొనుగోలులో తమకు ఉపయోగపడుతున్నాయని సర్వేలో పాల్గొన్న 72 శాతం మంది చెప్పారు.
- వాహన సంబంధిత ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ను రోజూ చూస్తుంటామని సర్వేలో పాల్గొన్న 41 శాతం మంది చెప్పారు.
- ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లలోని ఏఐ ఫీచర్లు కూడా నెటిజన్లను వాహనాల వైపు ఆకట్టుకుంటున్నాయి.
కాంతార్
ఈ అధ్యయనంలో భాగంగా కొత్తగా వాహనాలు కొనే వారిని ‘కాంతార్’ సంస్థ సర్వే చేసింది. ఇందుకోసం 2023 సెప్టెంబరులో దేశవ్యాప్తంగా 49,590 మంది 18-64 ఏళ్లలోపు కొత్త వాహన కొనుగోలుదారుల అభిప్రాయాలను సేకరించింది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లలో ప్రకటనలు ఇవ్వడం ద్వారా వినియోగదారులను చేరుకోవడంపై దేశంలోని వాహన డీలర్లకు అవగాహన కల్పించేందుకు మెటా కంపెనీ 'మూవ్ విత్ మెటా' కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందుకోసం భారత ఆటోమొబైల్ డీలర్ల సంఘాల సమాఖ్య(FADA)తో చేతులు కలిపింది. డిజిటల్ ప్రచారంతో వినియోగదారులను చేరుకోవడంపై దేశవ్యాప్తంగా దాదాపు 3వేలకుపైగా ఆటోమొబైల్ డీలర్లకు మెటా అవగాహన కల్పించింది.