KL Rahul Border Gavaskar Trophy :బాక్సింగ్ డే టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా బ్యాటర్ కేఎల్ రాహుల్ 24 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఈ ఇన్నింగ్స్‌లో 42 బంతులు ఎదుర్కొన్న రాహుల్ క్రీజులో కాస్త కుదురుకున్నట్లు కనిపించినా, కమిన్స్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయితే రాహుల్ బ్యాటింగ్‌కు రాగానే ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియాన్ అతడి ఏకాగ్రత దెబ్బతీసే ప్రయత్నం షురూ చేశాడు. తన మాటలతో కవ్వింపు చర్యలకు పాల్పడ్డాడు.
'సిరీస్‌లో ఓపెనర్‌గా రాణిస్తున్నావ్ కదా. ఏం తప్పు చేశావు. నీకు ఈ డిమోషన్ ఏంటి? ఓపెనర్వి వన్ డౌన్లో బ్యాటింగ్‌కు వచ్చావేంటి?' అంటూ రాహుల్‌పై స్లెడ్డింగ్కు పాల్పడ్డాడు. లియాన్ కామెంట్స్ స్టంప్ మైక్‌లో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గతంలోనూ భారత బ్యాటర్లను ఆసీస్ ప్లేయర్లు స్లెడ్జింగ్ సందర్భాలు చాలానే ఉన్నాయి.
రాణించిన రాహుల్
బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో కేఎల్ రాహుల్ మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. పెర్త్ టెస్ట్‌లో రెండో ఇన్నింగ్స్‌లో ఆకట్టుకున్న రాహుల్, తర్వాత మ్యాచ్‌ల్లోనూ రాణించాడు. గబ్బా టెస్టు డ్రా గా ముగియడంలోనూ రాహుల్ పాత్ర ఉంది. అయితే గత రెండు మ్యాచ్‌ల్లో మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ రోహిత్ శర్మ ఘోరంగా విఫలయ్యాడు.