Musheer Khan Accident :భారత యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ సోదరుడు ముషీర్ ఖాన్ రోడ్డు ప్రమాదం తర్వాత తొలిసారి మాట్లాడాడు. ఇలాంటి పరిస్థితుల్లో అతడికి అండగా నిలబడిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు. ఇక ముషీర్ తండ్రి నౌషద్ ఖాన్ కూడా బీసీసీఐ, ఫ్యాన్స్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఓ వీడియోను ముషీర్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
'నాకు కొత్త జీవితాన్ని ఇచ్చినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు. ప్రస్తుతం మా ఆరోగ్యం నిలకడగానే ఉంది. నాతో మా నాన్న ఉన్నారు. ఆయన కూడా క్షేమంగానే ఉన్నారు. మీ ప్రార్థనలకి ధన్యవాదాలు' అంటూ ముషీర్ వీడియోలో తెలిపాడు. ఇక నౌషద్ ఖాన్ కూడా మాట్లాడారు. 'మా కోసం ప్రార్థించిన అభిమానులకు, శ్రేయోభిలాషులు, బంధువులు అందరికీ కృతజ్ఞతలు. ఈ పరిస్థితుల్లో అండగా ఉన్న బీసీసీఐ, ముంబయి క్రికెట్ అసోసియేషన్‌కి థాంక్స్. ముషీర్ పట్ల శ్రద్ధ వహించారు. ముషీర్ ట్రీట్మెంట్ గురించి ఇంకా ఎలాంటి అప్డేట్ లేదు. దాని కోసం ఎదురు చూడాలి. ఎప్పుడైనా మనకి ఉన్నదాంట్లోనే సంతృప్తి పడాలి. అదే జీవితమంటే' అంటూ చెప్పుకొచ్చారు నౌషద్ ఖాన్.
అయితే వచ్చే నెల జరగనున్న ఇరానీ ట్రోఫీ కోసం ముషీర్ ఖాన్ తన తండ్రితో కలిసి శనివారం లఖ్‌నవూ వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న వాహనం డివైడర్‌ని ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముషీర్ మెడకి ఫ్రాక్చర్ కాగా, అతడి తండ్రి నౌషద్‌కి స్వల్ప గాయాలయ్యాయి. ప్రస్తుతం ముషీర్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 1 నుంచి ప్రారంభం కానున్న ఇరానీ ట్రోఫీకి దూరమయ్యాడు. కాగా, ఇటీవల జరిగిన దులీప్ ట్రోఫీలో ఇండియా బికి ప్రాతినిధ్యం వహించిన ముషీర్ భారీ సెంచరీతో ఆకట్టుకున్నాడు.