MCA Guinness Record :ముంబయి క్రికెట్ అసోసియేషన్ (MCA) వాంఖడే స్టేడియం 50 ఏళ్ల సంబరాలు ఘనంగా నిర్వహిస్తోంది. వేడుకల్లో భాగంగా గురువారం 14,505 ఎరుపు, తెలుపు బంతులు ఉపయోగించి మైదానంలో 'ఫిప్టీ ఇయర్స్ ఆఫ్ వాంఖడే స్టేడియం' అనే వాక్యం రాసింది. క్రికెట్ బంతులు ఉపయోగించి రాసిన 'అతి పెద్ద వాఖ్యం (Largest Cricket Ball Sentence)'గా దీనికి గిన్నిస్ రికార్డు వరించింది. దీంతో ప్రతిష్ఠాత్మకమైన వాంఖడే చరిత్రలో మరో అరుదైన రికార్డు చేరింది.
అయితే వాంఖడే స్టేడియంలో మొట్టమొదటి క్రికెట్ మ్యాచ్ జరిగిన రోజునే గిన్నిస్ అవార్డు అందుకోవడం విశేషం. వాంఖడేలో 1975 జనవరి 23న తొలి అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఇందులో భారత్- వెస్టిండీస్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో దివంగత ఏక్‌నాథ్ సోల్కర్ సెంచరీ బాదాడు. ఎంసీఏ సాధించిన రికార్డును ఈ ఏక్‌నాథ్ సోల్కర్, భారత్‌కి ప్రాతినిథ్యం వహించిన ముంబయి ప్లేయర్లకు అంకితం ఇచ్చింది.
ఈ బంతులు ఎవరికంటే?
ఎంసీఏ ప్రెసిడెంట్ అజింక్య నాయక్, ఆఫీస్ బేరర్లు, అపెక్స్ కౌన్సిల్ సభ్యుల సమక్షంలో ఈ రికార్డు సాధించారు. ఎంసీఏ ఈ రికార్డును సాధించడానికి ఉపయోగించిన బంతులను నగరంలోని పాఠశాలలు, క్లబ్‌లు, NGOలకు చెందిన ఔత్సాహిక క్రికెటర్లకు అందజేయనుంది.