Mumbai Indians Replacement :ముంబయి ఇండియన్స్ స్పిన్నర్ అల్లాగ్ గజన్‌ఫర్ గాయం కారణంగా 2025 ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. దీంతో మేనేజ్మెంట్ అతడి రిప్లేస్మెంట్ ప్రకటించింది. గజన్‌ఫర్ స్థానాన్ని ముజీబ్ అర్ రెహ్మాన్ భర్తీ చేయనున్నట్లు ముంబయి ఆదివారం అధికారిక ప్రకటన చేసింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేసింది.
'గజన్‌ఫర్ స్థానాన్ని ముజీబ్ అర్ రెహ్మాన్ భర్తీ చేయనున్నాడు. అఫ్గాన్‌కు అంతర్జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహిస్తున్న యంగ్ ప్లేయర్లలో ముజీబ్ ఒకడు. ముజీబ్‌కు ముంబయిలోకి స్వాగతం. అలాగే గజన్‌ఫర్ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాం' అని ముంబయి మేనేజ్మెంట్ పోస్ట్ చేసింది. ముంబయి అతడిని రూ.2 కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది.
అయితే ముజీబ్ 17ఏళ్ల వయసులోనే ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. 2018 ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చిన అతడు పంజాబ్ తరఫున ఆడాడు. ఆ తర్వాత కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లకు ఆడాడు. ఐపీఎల్లో ఇప్పటివరకు 19 మ్యాచ్‌లు ఆడిన ముజీబ్ 19 వికెట్లు పడగొట్టాడు. ఇక టీ20 కెరీర్లో ఓవరాల్‌గా 300 మ్యాచ్‌ల్లో 330 వికెట్లతో సత్తా చాటాడు. చివరిసారిగా 2021లో ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు.