Mohammed Shami Comeback :టీమ్ఇండియా పేసర్ మహ్మద్ షమీ తన గాయం గురించి స్వయంగా అప్డేట్ ఇచ్చాడు. ప్రస్తుతం తాను మోకాలి గాయం నుంచి కోలుకున్నానని షమీ స్పష్టం చేశాడు. ఆస్ట్రేలియాలో జరిగనున్న బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో పునరాగమనమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించాడు. త్వరలోనే బంగాల్ తరఫున రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడతానని తెలిపాడు. ప్రస్తుతం తాను 100 శాతం ఫిట్నెస్తో ఉన్నానని చెప్పుకొచ్చాడు. రీసెంట్గా ఓ కార్యక్రమంలో పాల్గొన్న షమీ, మీడియాతో ఈ వ్యాఖ్యలు చేశాడు.
'100 శాతం ఫిట్'
'ప్రస్తుతం నేను గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాను. ఆస్ట్రేలియాతో సిరీస్‌తో టీమ్ఇండియాలో రీ ఎంట్రీ ఇవ్వడమే నా లక్ష్యం. నిన్న బౌలింగ్ చేసినందుకు సంతోషంగా ఉంది. అంతకుముందు గాయం తిరగబెడుతుందనే భయంతో హాఫ్ రన్నింగ్‌తోనే బౌలింగ్ చేశా. కానీ నిన్న బౌలింగ్ చేసినప్పుడు ఏం ఇబ్బంది కలగలేదు. 100శాతం ఫిట్నెస్తో బౌలింగ్ చేశా. ఫలితంగా బాగుంది. గాయం నొప్పి పెట్టలేదు. ఆస్ట్రేలియా సిరీస్‌కు నేను రీఎంట్రీ ఇస్తానా అని చాలా మంది ఆలోచిస్తున్నారు. అది తేలడానికి ఇంకా కొంత సమయం ఉంది' అని షమీ తెలిపాడు.
కాగా, షమీ నెట్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ మారాయి. ఈ నేపథ్యంలో షమీ ఇంకా ఫిట్నెస్ సాధించాల్సి ఉందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. న్యూజిలాండ్‌తో టెస్టు అనంతరం మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశాడు. ఫిజియో, వైద్యులతో కలిసి షమీ తీవ్రంగా శ్రమిస్తున్నాడని కెప్టెన్ తెలిపాడు. షమీ విషయంలో రిస్క్ తీసుకోదల్చుకోవడం లేదని పేర్కొన్నాడు. షమీ వందశాతం ఫిట్‌గా ఉండాలనేదే తమ ఆకాంక్ష అని, అతడి మోకాలి గాయం మళ్లీ తిరగబెట్టిందని వెల్లడించాడు. అయితే షమీ తాను గాయం నుంచి 100 శాతం కోలుకున్నానని తాజాగా చెప్పడం గమనార్హం.