Shami Age Controversy :టీమ్ఇండియా సీనియర్ పేసర్ షమీ ఇటీవల కాలంలో కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాడు. ఇప్పటికే భార్యతో గృహ హింస ఆరోపణలు ఎదుర్కొన్న షమీ, బోర్డర్- గావస్కర్ సిరీస్ ముంగిట కొత్త కాంట్రవర్సీలో చిక్కుకున్నాడు. ఈసారి తన వయసు వివాదంగా మారింది. అతడు తన అసలు వయసు బయటకు చెప్పకుండా, దాచిపెట్టాడని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. దీనికి సంబంధించిన ఓ సర్టిఫికెట్ తాజాగా ట్విట్టర్లో వైరల్ అవుతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే?
ఏజ్ ఫేక్!
మహ్మద్ షమీ తన ఏజ్ తక్కువగా చెబుతున్నాడని ఓ నెటిజన్ ఆరోపించారు. దీనికి ఆధారంగా సదరు నెటిజన్ షమీ డ్రైవింగ్ లైసెన్స్ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దాని ప్రకారం 2024 నాటికి షమీ వయసు 42ఏళ్లు. కానీ, షమీ బీసీసీఐకి సమర్పించిన పత్రాల ప్రకారం అతడి ఏజ్ నేటికి 34 సంవత్సరాలే. అంటే ఈ రెండింటి మధ్య ఎనిమిదేళ్లు తేడా ఉంది. కాగా, ఈ పోస్ట్‌ను బీసీసీఐకి ట్యాగ్ చేసి, షమీ వయసుపై విచారణ జరిపించాల్సిందిగా ఆ నెటిజన్ కోరారు. కానీ, బీసీసీఐ నుంచి దీనిపై ఎలాంటి స్పందన లేదు.
ప్రస్తుతం ఈ లైసెన్స్ సర్టిఫికెట్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. ఇది ఫేక్ అంటూ పలువురు అతడికి మద్దతుగా కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ డ్రైవింగ్ లైసెన్స్ ఫొటో నిజమైనదేనా? లేక ఎడిట్ చేసిందా? అసలు ఇది షమీదేనా? అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఒకవేళ ఏజ్ విషయంలో షమీ తప్పు చేస్తే అతడిపై బీసీసీఐ చర్యలు తీసుకునే అవకాశం ఉంది.