Strange Run Out Cricket : క్రికెట్ చరిత్రలోనే ఓ బ్యాటర్ విచిత్రమైన విధంగా రనౌట్ అయ్యాడు. తాను క్రీజులో నుంచి బయటకు రానప్పటికీ ఔట్‌గా పెవిలియన్ చేరాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 'ఇలా కూడా ఔట్ అవుతారా?' అంటు నెటిజన్లు కామెంట్లు పెడుతునున్నారు. మరి మీరూ ఈ రనౌట్ చూసేయండి!
ఇదీ జరిగింది
ఈ సంఘటన పాకిస్థాన్ డొమెస్టిక్ లీగ్ క్వైడ్ అజామ్ ట్రోఫీ (Quaid-e-Azam Trophy)లో జరిగింది. టోర్నీలో భాగంగా పెషవార్- సియల్‌కోట్ మ్యాచ్ గురువారం ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో సియల్ కోట్ బ్యాటర్ మొహమ్మద్ వాలీద్ దురదృష్టకర రీతిలో ఔట్ అయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆమిర్ ఖాన్ వేసిన బంతిని స్టైకింగ్‌లో ఉన్న వాలీద్ డిఫెన్స్ ఆడాడు. బంతి నేరుగా బౌలర్ ఆమిర్ చేతికి వెళ్లింది.
వెంటనే ఆమిర్ బంతిని వికెట్లవైపు విసిరాడు. అయితే క్రీజులో ఉన్న వాలీద్ బంతి తనకు తాకుతుందేమో అని గాల్లోకి జంప్ చేశాడు. దీంతో బంతి నేరుగా స్టంప్స్‌కు తగిలింది. వెంటనే పెష్‌వార్ ప్లేయర్లు అప్పీల్ చేయగా, ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేశాడు. అయితే బంతి స్టంప్స్‌ను తాకే సమయంలో వాలీద్ గాల్లో ఉన్నట్లు రిప్లైలో తేలింది. దీంతో థర్డ్ అంపైర్ వాలీద్‌ను ఔట్‌గా ప్రకటించాడు. క్రీజులో ఉన్నప్పటికీ రనౌట్‌గా పెవిలియన్ చేరాల్సి వచ్చింది.
Strange dismissal 😲
— Pakistan Cricket (@TheRealPCB) January 3, 2025
Mohammad Waleed gets out in a bizarre manner ❌#QeAT | #SKTvPSH pic.twitter.com/0SEGUaqIC4
భిన్నాభిప్రాయాలు
అయితే ఈ రనౌట్‌పై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. కొందరు ఇది ఫన్నీ రనౌట్ అనగా, మరికొందరు మాత్రం ఇది కరెక్ట్ కాదంటూ తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 'బంతి తనకు గాయం చేయకుండా బ్యాటర్ అలా జంప్ చేశాడు', 'దీన్ని ఔట్‌గా ప్రకటించకూడదు', 'ఇలాంటివి పాకిస్థాన్ క్రికెట్లోనే జరుగుతాయి' అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.