Mitchell Starc IPL 2024:ఐపీఎల్ 2024 మొదలైపోయింది. వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాళ్ల ప్రదర్శనలపై అభిమానుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి. ఐపీఎల్ 17వ సీజన్‌కి ముందు 2023 చివర్లో మినీ వేలం నిర్వహించారు. ఈ వేలంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు మిచెల్ స్టార్క్, కమిన్స్ అత్యధిక ధరకు అమ్ముడయ్యారు. అందులో పేసర్ మిచెల్ స్టార్క్ కోసం కోల్‌కతా నైట్ రైడర్స్ ఏకంగా రూ.24.75 కోట్లు వెచ్చింది. ఇది ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర కావడం విశేషం. ఈ క్రమంలో అతడు వేసే ఒక్కో ఒక్కో బంతి విలువ ఎంతో తెలుసా?
ఐపీఎల్‌లో ఏ జట్టైనా కనీసం 14 మ్యాచ్‌లు ఆడుతుంది. స్టార్క్‌ను భారీ దక్కించుకున్నందున అతడిని ఏ ఒక్క మ్యాచ్‌లోనూ బెంచ్‌కు పరిమితం చేసే ఛాన్స్ లేదు. ఈ లెక్కన స్టార్క్ అన్ని మ్యాచ్‌లు ఆడతాడు. ఇక ప్రతి మ్యాచ్‌లో ఓ బౌలరైనా గరిష్ఠంగా 4 ఓవర్లు బౌలింగ్ చేస్తాడు. ఈ లెక్కన ఈ సీజన్లో అన్ని మ్యాచ్‌ల్లో కలిపి స్టార్ 56 ఓవర్లు బౌలింగ్ చేసే అవకాశం ఉంటుంది. అంటే స్టార్క్ వేసే ఒక్కో బంతి దాదాపు రూ. 7.35 లక్షల విలువ అవుతుంది.
ఇక 2012, 2014లో ఐపీఎల్ ట్రోఫీలు గెలిచిన కోల్‌కతా మూడో టైటిల్ గెలవాలనే కసితో వేలంలో పోటీపడి మిచెల్ స్టార్క్‌ని కొనుగోలు చేసింది. అయితే స్టార్క్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున 2014, 2015లో రెండు IPL సీజన్లలో మాత్రమే ఆడాడు. ఆ తర్వాత 2018లో మరోసారి వేలంలో అమ్ముడైనా, బరిలోకి దిగలేదు. దీంతో చాలాకాలం తర్వాత బరిలో దిగనున్న స్టార్క్‌పై అభిమానులు గంపెడన్ని ఆశలు పెట్టుకున్నారు. ఈ లెజెండరీ బౌలర్ ఐపీఎల్ రీఎంట్రీతో కేకేఆర్‌కి మూడోకప్పు అందించడంలో కీలక పాత్ర పోషిస్తాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇక కేకేఆర్ 2024 ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో మార్చి 23న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది.