MI vs UPW WPL 2024:2024 డబ్ల్యూపీఎల్‌లో యూపీ వారియర్స్ ఎట్టకేలకు గెలుపు బాట పట్టింది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిన యూపీ, బుధవారం డిఫెండిగ్ ఛాంపియన్ ముంబయిపై గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. ప్రత్యర్థి నిర్దేశించిన 162 పరుగుల లక్ష్యాన్ని యూపీ 16.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. గ్రేస్ హారిస్ (38 పరుగులు*), దీప్తి శర్మ (27 పరుగులు*) రాణించారు. ఓపెనర్ కిరణ్ నౌగిరె (57 పరుగులు 31 బంతుల్లో) మెరుపు హాఫ్ సెంచరీకి తోడు అలీసా హీలీ (33 పరుగులు) అదరగొట్టింది. ముంబయి బౌలర్లలో ఇస్సీ వాంగ్ 2, అమెలియా కేర్ 1 వికెట్ దక్కించుకున్నారు.
162 పరుగుల లక్ష్య ఛేదనను యూపీ ఘనంగా ఆరంభించింది. ప్రారంభం నుంచే దూకుడుగా ఆడిన ఓపెనర్లు రన్‌రేట్ 9కి తగ్గకుండా చూసుకున్నారు. ఈ క్రమంలోనే కిరణ్ నౌగిరె అర్ధ శతకం పూర్తి చేసుకుంది. అయితే ఇన్నింగ్స్ సాఫీగా సాగుతున్న సమయంలో వాంగ్ ముంబయికి బ్రేక్ ఇచ్చింది. 94 పరుగుల వద్ద నౌగిరెను ఔట్ చేలి ముంబయికి తొలి వికెట్ అందించింది. ఆ వెంటనే వన్ డౌన్లో వచ్చిన తహిళ మెక్‌గ్రాత్ (1) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగింది. అదే ఓవర్లో నాలుగో బంతికి మరో ఓపెనర్ హీలీ కూడా ఔటవ్వడం వల్ల ముంబయి శిబిరంలో ఆశలు చిగురించాయి. కానీ, గ్రేస్ హారిస్, దీప్తి శర్మ ముంబయికి మరో ఛాన్స్ ఇవ్వకుండా మ్యాచ్ ముగించేశారు. దీంతో వరుస విజయాలతో జోరు మీదున్న ముంబయికి బ్రేక్ పడింది.