Manu Bhaker Take Break From Shooting :ఇటీవలే ముగిసిన పారిస్ ఒలింపిక్స్ 2024లో రెండు కాంస్య పతకాలతో ప్రపంచ క్రీడా వేదికపై మను బాకర్ సత్తాచాటిన సంగతి తెలిసిందే. అయితే వాస్తవానికి ఈ ఒలింపిక్స్ కోసం ఎన్నో అభిరుచులను పక్కన పెట్టింది మను బాకర్. చిన్నతనంలోనే కరాటేలో ట్రైనింగ్ తీసుకున్నప్పటికీ షూటింగ్‌వైపు మనసు మార్చుకుంది. ఫైనల్గా అనుకున్న లక్ష్యాన్ని సాధించింది.
అయితే ఇంత కాలం పిస్టల్ చప్పుళ్లతో ఖాళీ లేకుండా గడిపిన మను బాకర్ కొన్ని నెలల పాటు ఈ గన్ శబ్దాలకు కాస్త దూరంగా ఉండాలని అనుకుంటోందట. మూడు నెలల పాటు షూటింగ్ నుంచి విరామం తీసుకొని స్కేటింగ్, గుర్రపు స్వారీ, భరతనాట్యం వంటి వాటిపై దృష్టి పెట్టబోతున్నట్లు తెలిపింది. కోచ్ జస్పాల్ రానాతో కలిసి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలిపింది. ఇంకా పలు ఆసక్తికర విషయాలను తెలిపింది.
"ఇప్పుడు నాకు కాస్త సమయం దొరికింది. కరాటే ట్రైనింగ్ మళ్లీ చేయగలను అని అనుకుంటున్నాను. అంతకుముందు దాని కోసం సమయం కేటాయించలేకపోయాను. ఇప్పుడు నా వ్యక్తిగత ఇష్టాల కోసం కాస్త బ్రేక్ దొరికింది. స్కేటింగ్, గుర్రపు స్వారీ అంటే ఎంతో ఇష్టం. రోడ్లపైనా కూడా చేయగలను. డ్యాన్స్ కూడా చాలా ఇష్టం. అందుకే భరత నాట్యం నేర్చుకుంటున్నాను. వయోలిన్ కూడా వచ్చు" అని మను బాకర్ వెల్లడించింది.