Special Story On Gopalraopet Agriculture : పంటల సాగులో నష్టాలొస్తే వ్యవసాయం వదిలివేయడం, గిట్టుబాటు ధర లేక, పెట్టుబడి రాక పట్టణాలకు వలస వెళ్లి కూలీ నాలీ చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు అన్నదాతలు. కానీ ఆ ఊరి రైతులు మాత్రం ఇందుకు భిన్నం. కొత్తగా ఆలోచిస్తూ సాగును లాభసాటిగా మార్చుకున్నారు. అధిక దిగుబడులు సాధిస్తూ ఆదాయాన్ని పెంచుకుంటున్నారు. పిల్లలను కష్టపడి మంచిగా చదివిపించి దేశ, విదేశాల్లో ఉన్నత స్థానాల్లో నిలిపారు. రైతే రాజు అనేదాన్ని నిజం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
కరీంనగర్ జిల్లా ధర్మారం మండలం గోపాల్‌రావుపేటలో 1,390 మంది జనాభా ఉంది. ఈ గ్రామంలో 455 కుటుంబాలుండగా అందరి వృత్తి వ్యవసాయమే. కొన్ని సంవత్సరాల క్రితమే పసుపు, మిర్చి, పత్తి పంటల సాగుతో ఈ ఊరు మంచి గుర్తింపు సాధించింది. ప్రస్తుతం లాభదాయకంగా ఉన్న ఉద్యాన పంటలపై దృష్టి పెడుతున్నారు. ఇక్కడ పల్లపు ప్రాంతాల్లో, చెరువు ఆయకట్టులో వరి సాగు చేస్తుంటారు. పంట ఏదైనా సరే, అధిక దిగుబడులు సాధించడంలో గోపాల్‌రావుపేట ముందుంటుంది.
ఆధునిక పద్ధతులకు పెద్దపీట : 30 ఏళ్లుగా ఆధునిక సాంకేతిక పద్ధతులతో అధిక రాబడి పొందుతున్న ఈ గ్రామ రైతులు, ఆ తర్వాత మామిడి తోటల పెంపకంపై దృష్టి పెట్టారు. ఎస్సీ కార్పొరేషన్ మామిడి తోటల పెంపకానికి అప్పట్లో ఇచ్చిన రాయితీ రుణాలను, ఉపాధి హామీలో పండ్ల తోటల పెంపకం వంటి పథకాలను సద్వినియోగం చేసుకున్నారు. ఇక్కడ ఎక్కువ మంది రైతులకు 3 ఎకరాల మామిడి తోట ఉంటుంది.
2005 నుంచే ఇక్కడ వరి కోత యంత్రాలు, పది చైన్ హార్వెస్టర్లు, 23 సాధారణ వరి కోత యంత్రాలున్నాయి. గ్రామానికి చెందిన రైతు తిరుపతిరెడ్డి డ్రోన్ ద్వారా ఎరువులు పిచికారీ చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం అందుబాటులోకి తేవడానికి స్థానికులు విరాళాలు వేసుకొని ఊరి మధ్యలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించారు.
విదేశీ ఉద్యోగాలపై దృష్టి : ఇక్కడి రైతులు తమ పిల్లలను విదేశాలకు పంపడమే మొదటి ప్రాధాన్యంగా ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం గ్రామానికి చెందిన 18 మంది అమెరికాలో ఉన్నారు. పది మంది దాకా ఇతర దేశాల్లో ఉంటున్నారు. ఇతర దేశాలకు వెళ్లేందుకు సమాయత్తమవుతున్న వారు ఇంకా పదుల సంఖ్యలో ఉన్నారు. విదేశాల్లో డిమాండ్ ఉన్న కోర్సులను ఎంచుకుంటూ అమెరికా, ఆస్ట్రేలియా, లండన్ తదితర దేశాలకు వెళ్లేందుకు గ్రామ విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు.
ఇక్కడి యువత 22 మంది హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు. విదేశాల్లో స్ధిరపడిన వారికి ట్యాక్స్ కన్సల్టెంట్లుగా వ్యవహరించేందుకు కొంతమంది హైదరాబాద్‌లో ఏజెన్సీలు పెట్టారు. వీరి కంపెనీల్లో ఒక్కో చోట సగటున 50 మంది ఉద్యోగులు ఉన్నారు. గ్రామానికి చెందిన 17 మంది వివిధ ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు. అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఎల్లాల నరసింహారెడ్డి, ఆ తర్వాత వైద్యుడిగా స్థిరపడిన డా.చంద్రశేఖర్‌రెడ్డి, సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో స్థిరపడిన రాజేందర్‌రెడ్డిల స్ఫూర్తితో చాలా మంది రైతులు తమ పిల్లలను విదేశాలకు పంపిస్తున్నారు.
"కష్టపడి చదివితే విదేశాల్లో మంచి అవకాశాలుండటంతో పిల్లలను అక్కడికి పంపిస్తున్నాం. ఇందుకోసం తీసుకున్న బ్యాంకు రుణాలను పంటలు చేతికొచ్చాక చెల్లిస్తున్నాం. నాకు ఇద్దరు కుమార్తెలు. పెద్దమ్మాయి ఆస్ట్రేలియాలో బ్యుటీషియన్‌గా పని చేస్తుండగా, చిన్న కుమార్తె అమెరికాలో ఎంఎస్ చదువుతోంది." - సంకసాని తిరుపతి రెడ్డి, రైతు
'ఈ పాండవుల దేవాలయంలో మొక్కులు తీర్చుకుంటే పంటలు బాగా పండుతాయట'
ఎన్ని ఎకరాలు కాదు - లాభం ఎంత అనేదే మ్యాటర్ - రూటు మారుస్తున్న రైతులు