Mohammad Shami Border Gavaskar Trophy : టీమ్‌ఇండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీ, బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ ఆడుతాడని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌కు నిరాశే మిగిలింది. ఎడమ మోకాలిలో చిన్న వాపు కారణంగా చివరి రెండు టెస్టులకు కూడా షమీ అందుబాటులో ఉండడని బీసీసీఐ సోమవారం స్పష్టం చేసింది.
షమీ ఆ మధ్య తన కుడి మడమకు శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. అయితే శస్త్రచికిత్సకు సంబంధించి ప్రస్తుతం అతడికి ఎలాంటి సమస్యలు లేవని, దాని నుంచి పూర్తిగా కోలుకున్నాడని బోర్డు తెలిపింది. కానీ, ఇప్పుడు అతడి కుడి కాలి మోకాలు చిన్న వాపు వచ్చిందని, బౌలింగ్ చేయడం వల్ల అది మరింత పెరిగిందని ప్రకటనలో పేర్కొంది.
బీసీసీఐ ఓ ప్రకటనలో, "లాంగ్ రికవరీ పీరియడ్ తర్వాత షమీ బౌలింగ్ ఎక్కువ చేస్తున్నాడు. దీంతో అతడికి వాపు వచ్చింది. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లోని మెడికల్ టీమ్ అతడిని నిశితంగా పరిశీలిస్తోంది." అని పేర్కొంది.
డొమెస్టిక్ క్రికెట్‌లో పెరిగిన పనిభారం
శస్త్రచికిత్స తర్వాత కొంత కాలంగా క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు షమీ. అయితే రీసెంట్‌గానే ఆ సమస్య నుంచి కోలుకున్న అతడు, దేశవాళీ క్రికెట్ ఆడుతున్నాడు. నవంబర్‌లో షమీ బెంగాల్ తరఫున రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో పాల్గొన్నాడు. మధ్యప్రదేశ్‌పై 43 ఓవర్లు బౌలింగ్ చేశాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT)లో కూడా తొమ్మిది మ్యాచ్‌లు ఆడాడు. టెస్ట్ సిరీస్‌కు సిద్ధం కావడానికి ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేశాడు.
ఈ ప్రయత్నాలతో అతడి ఫిట్‌నెస్ మెరుగైనప్పటికీ, జాయింట్‌పై లోడ్ పెరగడం వల్ల మోకాలిలో వాపు వచ్చింది. దీంతో షమీని పరిశీలించిన బీసీసీఐ మెడికల్ టీమ్, అతడు పనిభారాన్ని మేనేజ్ చేయడానికి, పూర్తిగా కోలుకోవడానికి మరింత సమయం కావాలని నిర్ణయించింది.
చివరి రెండు టెస్టులకు నో ఛాన్స్
అందుకే సిరీస్‌లోని మిగిలిన టెస్టులు షమీ ఆడడని బీసీసీఐ ప్రకటించింది. అతడు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లోని మెడికల్ టీమ్ మార్గదర్శకత్వంలో స్ట్రెంథ్, రికవరీపై దృష్టి పెట్టనున్నట్లు తెలిపింది. దీంతో షమీ కోలుకునే పురోగతిపైనే క్రికెట్‌కు తిరిగి రావడం ఆధారపడి ఉంటుంది.
కాగా, వరల్ట్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు భారత్ అర్హత సాధించాలంటే జరగబోయే రెండు టెస్టులు తప్పక గెలవాలి. ఈ సిరీస్‌లో టీమ్ బౌలింగ్‌లో ఎక్కువగా బుమ్రాపైనే ఆధారపడుతోంది. ఇతర బౌలర్‌లు పెద్దగా ప్రభావం చూపడం లేదు. ట్రోఫీలో కీలకమైన మ్యాచ్‌లకు టీమ్‌ఇండియా సిద్ధమవుతున్న తరుణంలో షమీ అందుబాటులో ఉండకపోవడం పెద్ద ఎదురుదెబ్బే.
క్షీణించిన వినోద్ కాంబ్లీ ఆరోగ్య పరిస్థితి - ఇప్పుడెలా ఉందంటే?