KCR, Hareesh Rao Quash Petitions in High Court : భూపాలపల్లి కోర్టు ఇచ్చిన నోటీసులను కొట్టివేయాలని హైకోర్టులో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావులు క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని ముఖ్యమైన ఆనకట్ట అయిన మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో అవినీతి జరిగిందంటూ గతంలో భూపాలపల్లి కోర్టులో సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి అనే వ్యక్తి పిటిషన్ వేసారు. అనంతరం 2024 సెప్టెంబర్ 5, అక్టోబర్ 17వ తేదీల్లో భూపాలపల్లి జిల్లా కోర్టు విచారణ చేపట్టింది. తరువాత తదుపరి విచారణను ఈ నెల (డిసెంబరు) 27వ తేదీకి వాయిదా వేసింది. ఈ క్రమంలో కేసీఆర్, హరీశ్‌రావులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
రేపు హైకోర్టులో విచారణ : మేడిగడ్డ బ్యారేజీని నిర్మించే క్రమంలో ప్రజాధనం వృథా అయిందని, నిర్మాణంలో ప్రమాణాలు పాటించలేదని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. రాజలింగమూర్తి పిటిషన్ ఆధారం చేసుకుని భూపాలపల్లి కోర్టు కేసీఆర్, హరీశ్‌రావులతో సహా మరో ఆరుగురికి నోటీసులను జారీ చేసింది. ఈ నోటీసులను సవాలు చేస్తూ తాజాగా హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావులు ఈ నోటీసులను కొట్టివేయాలని పిటిషన్లు వేశారు. దీంతో వీరి పిటిషన్లపై రేపు మంగళవారం (డిసెంబరు 24న) హైకోర్టు విచారణ చేపట్టనుంది. ప్రైవేట్ పిటిషన్‌పై 2024 జులై 10న భూపాలపల్లి నోటీసులను జారీ చేసింది.
గతంలో 2024 ఆగస్టు 05వ తేదిన మేడిగడ్డ బ్యారేజీపై దాఖలైన పిటిషన్‌పై విచారణకు హాజరు కావాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు భూపాలపల్లి జిల్లా కోర్టు నోటీసులు జారీ చేసింది. ఆయనతో పాటు మాజీ మంత్రి హరీశ్‌రావు, బ్యారేజీ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ జనరల్ మేనేజర్ సురేశ్‌కుమార్ సహా మరో ఐదుగురికి నోటీసులు పంపింది.
కేసీఆర్ సర్కారే కారణం : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ కుంగడానికి అప్పటి సీఎం కేసీఆర్ సర్కారే కారణమని, ప్రజాధనం భారీగా దుర్వినియోగం అయినందువల్ల దీనిపై సమగ్రమైన విచారణ చేపట్టాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ 2023 నవంబరు 7న భూపాలపల్లి ప్రధాన మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టులో భూపాలపల్లికి చెందిన సామాజిక కార్యకర్త నాగవెల్లి రాజలింగమూర్తి ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ తమ పరిధిలోకి రాదంటూ జనవరి 2024 12వ తేదిన మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు పిటిషన్‌ను కొట్టివేసింది. దాన్ని సవాల్ చేస్తూ పిటిషనర్ అప్పుడే భూపాలపల్లిలోని జిల్లా కోర్టును ఆశ్రయించారు. దీంతో జిల్లా కోర్టు నిందితులకు నోటీసులు జారీ చేసింది.
'కేసీఆర్ చెప్పిన విధంగానే 'కాళేశ్వరం' నిర్మాణం - ఆయన ఎలా చెబితే అలా చేశాం'
'తెలియదు, గుర్తులేదు, అవగాహన లేదు' - కాళేశ్వరం కమిషన్ విచారణలో స్మితా సభర్వాల్