Police Send Notice To Allu Arjun : సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై చిక్కడపల్లి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో విచారణ కోసం A-11గా ఉన్న హీరో అల్లు అర్జున్‌కు నోటీసులు పంపారు. ఈరోజు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అల్లు అర్జున్‌కు తొక్కిసలాట ఘటనపై హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే దర్యాప్తు చేసుకునేందుకు పోలీసులకు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. నోటీసులపై అల్లు అర్జున్ తన లాయర్లతో చర్చించినట్లు తెలుస్తోంది.
శనివారం అసెంబ్లీలో సంధ్య థియేటర్ ఘటనపై ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. దీనికి కౌంటర్‌గా అదే రోజు తన నివాసంలో అల్లు అర్జున్ ప్రెస్‌మీట్ నిర్వహించడంతో ఈ అంశం మరోసారి రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా మారింది. అసెంబ్లీలో ముఖ్యమంత్రి చేసిన తన వ్యాఖ్యలను అల్లు అర్జున్ తప్పుపట్టారు. తొక్కిసలాట గురించి తనకు మరుసటి రోజు వరకు తెలియదని, తన క్యారెక్టర్‌ను తక్కువ చేసే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. అల్లు అర్జున్ చేసిన కామెంట్లకు కౌంటర్‌గా నిన్న సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ నిన్న మీడియా సమావేశం నిర్వహించి మరీ ఆ రోజు ఏం జరిగిందో కూలంకుశంగా వివరించారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా విడుదల చేశారు. ఇప్పుడు తాజాగా చిక్కడపల్లి పోలీసులు విచారణకు రావాలని అల్లు అర్జున్‌కు నోటీసులు జారీచేశారు.
అల్లుఅర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - తీవ్ర ఉద్రిక్తత - భారీగా పోలీసుల మోహరింపు
శ్రీతేజ్‌కు మైత్రీ మూవీ మేకర్స్ ఆర్థికసాయం : మరోవైపు ఇవాళ పుష్ప-2 సినిమాను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత నవీన్.. తొక్కిసలాటలో గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను పరామర్శించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కలిసి వెళ్లిన నవీన్.. శ్రీతేజ్ కుటుంబానికి 50లక్షల రూపాయల చెక్కును అందించారు. శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మరోవైపు నిన్న అల్లు అర్జున్ ఇంటిపై దాడికి దిగిన ఓయూ జేఏసీకి చెందిన ఆరుగురికి బెయిల్ మంజూరైంది.
గాంధీ భవన్‌కు అల్లు అర్జున్ మామ - ఫోన్ చేసి మాట్లాడిన టీపీపీసీ అధ్యక్షుడు