How to Make Black Forest Cake at Home : బర్త్ డే, మ్యారేజ్ డే ఇలా అకేషన్ ఏదైనా కేక్ కంపల్సరీ. ఇవేకాకుండా క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ ఈ రెండు అకేషన్లకు చాలా మంది కేక్ కట్ చేస్తుంటారు. ఈ క్రమంలో ఎక్కువ మంది కేక్ కావాలంటే బేకరీకి వెళ్తుంటారు. అయితే, ఈసారి కొనుగోలు చేయడం ఆపేయండి. ఇంట్లోనే ఈజీగా ఇలా "బ్లాక్ ఫారెస్ట్ కేక్" ప్రిపేర్ చేసుకోండి. టేస్ట్ కూడా చాలా బాగా ఉంటుంది! పైగా దీని తయారీకి ఓవెన్ కూడా అవసరం లేదు! మరి, ఇంకెందుకు ఆలస్యం అందుకు కావాల్సిన పదార్థాలేంటి? ఎలా తయారుచేయాలో ఇప్పుడు చూసేద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- కప్పున్నర - మైదా
- చెంచా - బేకింగ్ పౌడర్
- పావు కప్పు - కొకోవా
- అర చెంచా - బేకింగ్ సోడా
- చిటికెడు - ఉప్పు
- కప్పు - పాలు
- పంచదార పొడి - కప్పున్నర
- ముప్పావు కప్పు - బటర్
- కొద్దిగా - వెనీలా ఎసెన్స్
- 9 - చెర్రీపండ్లు
- అరకప్పు - చెర్రీపండ్ల ముక్కలు
- 2 కప్పులు - క్రీమ్
- 1 - చాక్లెట్ బార్
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా ఒక బౌల్లో చెర్రీపండ్ల ముక్కలు తీసుకొని అందులో 3 టేబుల్స్పూన్ల చక్కెర, కొన్ని వాటర్ యాడ్ చేసుకొని చెర్రీ సిరప్‌ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే చాక్లెట్ బార్ని తరిగి రెడీగా ఉంచుకోవాలి.
- ఇప్పుడు మరో బౌల్ తీసుకొని అందులో కప్పు పంచదార పొడి, బటర్ వేసి బాగా బీట్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులో మైదా, కొకోవా, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, పాలు, సగం వెనీలా ఎసెన్స్, ఉప్పు వేసి విస్కర్ సహాయంతో బాగా మిక్స్ చేసుకోవాలి.
- అనంతరం ఈ మిశ్రమాన్ని కేక్ ప్యాన్‌లోకి తీసుకొని ఓవెన్లో 180 డిగ్రీల వద్ద 30 నిమిషాలు బేక్ చేయాలి.
- అయితే, మీ ఇంట్లో కేక్ ప్యాన్ లేకపోతే అల్యూమినియం బౌల్లో లేదా మందంగా ఉండే స్టీల్ గిన్నెలో అయినా ఆ మిశ్రమాన్ని తీసుకోవాలి.
- అదే ఓవెన్ లేనివారు కేక్‌ని బేక్ చేసుకోవడానికి ఒక పెద్ద గిన్నె తీసుకొని దాని అడుగు భాగంలో ఒకటి నుంచి 2 కప్పుల వరకు సాల్ట్ వేసుకోవాలి. మీరు తీసుకునే బౌల్ అడుగు మందంగా ఉంటే ఉప్పు వేయకుండా కూడా బేక్ చేసుకోవచ్చు.
- ఆ తర్వాత గిన్నె అడుగు భాగంలో స్టాండ్‌ని ఉంచి మూతపెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ప్రిహీట్ చేయాలి. అనంతరం మీరు రెడీ చేసుకున్న కేక్ ప్యాన్ని స్టాండ్‌పై ఉంచి మూతపెట్టి మీడియం ఫ్లేమ్ మీద సుమారు 25 నుంచి 30 నిమిషాల పాటు బేక్ చేయాలి.
- అరగంట తర్వాత మూతతీసి టూత్‌పిక్ సహాయంతో గుచ్చి చూస్తే తడి లేకుండా ఉంటే అప్పుడు కేక్ చక్కగా బేక్ అయిందని అర్థం చేసుకోవాలి.
- ఇప్పుడు అది పూర్తిగా చల్లారాక ముందుగా ప్రిపేర్ చేసుకున్న చెర్రీ సిరప్‌ను లేయర్‌లా వేసుకోవాలి.
- ఆ తర్వాత ఒక చిన్న బౌల్లో క్రీమ్, పావుకప్పు పంచదార, మిగిలిన వెనీలా ఎసెన్స్ వేసి కలపాలి. ఇందులో కొంత భాగాన్ని పైపింగ్ బ్యాగ్‌లో వేసి పక్కన ఉంచుకోవాలి.
- మిగిలిన క్రీమ్ మిశ్రమాన్ని కేక్ మీద లేయర్‌లా వేసుకోవాలి. ఆపై దాని మీద చెర్రీ సిరప్ ఇలా అదొకటి, ఇదొకటి చొప్పున మరో రెండు పొరలు వచ్చాక పైన చెర్రీపండ్లు, మధ్యలో కొన్ని చాక్లెట్ కర్ల్స్ వేసి మిగిలినవి కేక్ చుట్టూ అద్దుకోవాలి.
- అనంతరం పైపింగ్ బ్యాగ్‌లో ఉన్న క్రీమ్‌తో కేక్‌పై అందంగా బోర్డర్లు, పూలు, డిజైన్లు వేసుకోవాలి. ఆ తర్వాత కొంతసేపు ఫ్రిజ్‌లో ఉంచి తీస్తే చాలు. అంతే, ఎంతో టేస్టీగా ఉండే నోరూరించే బేకరీ స్టైల్ "బ్లాక్ ఫారెస్ట్ కేక్" రెడీ!
ఇవీ చదవండి :
బేకరీ కేక్‌తో అనారోగ్య భయమా? - "రాగి బెల్లం కేక్" ఇంట్లోనే ట్రై చేయండిలా!
బేకరీ స్టైల్ "వెనీలా స్పాంజ్ కేక్" - ఇలా చేస్తే పిల్లలు ఇష్టంగా లాగిస్తారు!