Manu Bhaker Paris Olympics 2024:పారిస్ ఒలింపిక్స్‌లో భారత షూటర్ మనూ బాకర్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్లో అదరగొట్టింది. 580.27 స్కోరుతో మూడో స్థానంలో నిలిచి ఫైనల్‌కు దూసుకెళ్లింది. దీంతో ఎయిర్ పిస్టల్ సింగిల్స్‌లో 20 ఏళ్ల తర్వాత ఫైనల్ చేరిన భారత షూటర్‌గా మను బాకర్ రికార్డు సృష్టించింది. 2004 ఒలింపిక్స్‌లో ఇదే విభాగంలో సుమా శిరూర్ ఫైనల్‌కు చేరింది.
క్వాలిఫికేషన్ రౌండ్:మనూ బాకర్ క్వాలిఫికేషన్ రౌండ్‌లో అద్భుత ప్రదర్శన చేసింది. 580.27 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. ఆరు సిరీస్‌లలో సాధించిన పాయింట్లు:
- సిరీస్ 1: 97 పాయింట్లు
- సిరీస్ 2: 97 పాయింట్లు
- సిరీస్ 3: 98 పాయింట్లు
- సిరీస్ 4: 96 పాయింట్లు
- సిరీస్ 5: 96 పాయింట్లు
- సిరీస్ 6: 96 పాయింట్లు
మొదటి మూడు సిరీస్‌లలో సాధించిన పాయింట్లతో మొదటి రెండు స్థానాల్లోకి చేరింది. అనంతరం అదే జోరు కొనసాగించిన ఆమె మూడో స్థానం సాధించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో క్వాలిఫికేషన్ రౌండ్‌లో మను భాకర్ సాధించిన 27 బుల్‌సీలే అత్యధికం. ఇతర షూటర్‌లు ఈ స్థాయిలో బుల్‌సీలు సాధించలేకపోవడం గమనార్హం.
రిథమ్ సాంగ్వాన్ ఔట్: మరో షూటర్ రిథమ్ సాంగ్వాన్ కూడా ఇదే ఈవెంట్‌లో పోటీ పడింది. ఆట ప్రారంభంలో జోరుగా ఆడిన సాంగ్వాన్, ఆ తర్వాత జోరును కొనసాగించలేకపోయింది. తొలి సిరీస్‌లో 97 పాయింట్లతో బలంగా రౌండ్ మొదలుపెట్టింది. కానీ, రెండో సిరీస్‌లో 92 మాత్రమే స్కోర్ చేసింది. ఇది ఆమె ప్రదర్శనను ప్రభావితం చేసింది. 573 పాయింట్లతో 15వ స్థానంలో నిలిచి ఫైనల్స్‌కు దూరమైంది.