Manu Bhaker Politics : పారిస్ విశ్వ క్రీడల్లో రెండు కాంస్య పతకాలు సాధించి చరిత్ర సృష్టంచిన భారత స్టార్ షూటర్ మను బాకర్ కీలక వ్యాఖ్యలు చేసింది. తాను రాజకీయాల్లోకి రాబోనని వచ్చే ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించడంపైనే దృష్టి పెడతానని మను స్పష్టం చేసింది.
"నా దృష్టంతా క్రీడలపైనే ఉంది. నా లక్ష్యం ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించడమే. యువత చదువుతో పాటు క్రీడలపై శ్రద్ధ పెట్టి దేశానికి పతకాలు సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగాలి" అని మను బాకర్ తెలిపింది.
ఒలింపిక్స్ 100 గ్రాముల అధిక బరువుతో పతకాన్ని కోల్పోయిన వినేశ్ ఫొగాట్ ఉదంతంపైనా మను బాకర్ స్పందించింది. "వినేశ్ ఫొగాట్ ఓ పోరాట యోధురాలు. వినేశ్ వచ్చే ఒలింపిక్స్‌లో పతకం సాధించేందుకు మళ్లీ రంగంలోకి దిగాలి. ఆమె రిటైర్‌మెంట్ ఆలోచన విరమించుకుని మళ్లీ రెజ్లింగ్ బౌట్‌లో దిగాలని నేను కోరుకుంటున్నా" అని పేర్కొంది.
తాను రాజకీయాల్లోకి వచ్చే అవకాశమే లేదని మను బాకర్ వెల్లడించింది. "ఒలింపిక్స్‌లో కాంస్య పతకం కల నెరవేరడం ఆనందంగానే ఉంది. ఇప్పుడు మరింత కష్టపడి స్వర్ణం సాధించి ఆ బంగారు కలను కూడా నెరవేర్చుకుంటా" అని ఈ స్టార్ షూటర్ తెలిపింది. తనకు బాలీవుడ్‌కు వెళ్లే ఆలోచన కూడా లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం తన దృష్టి అంతా క్రీడలపైనే ఉందని, నటన గురించి ఆలోచించడం లేదని చెప్పింది.
అమ్మమ్మ ఊర్లో ఘన స్వాగతం - పారిస్ ఒలింపిక్స్‌లో రెండు పతకాలతో సత్తా చాటిన స్టార్ షూటర్ మను బాకర్‌కు స్వగ్రామంలో ఘన స్వాగతం లభించింది. తన అమ్మమ్మ ఊరు హరియాణలోని చర్కీ దాద్రిలో మను బాకర్‌కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. రెండు పతకాలతో మను దేశ ఖ్యాతిని విశ్వ వ్యాప్తం చేసిందని స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. పూలదండలతో మనును ముంచెత్తారు. సన్మాన కార్యక్రమంలో మాజీ మంత్రి సత్పాల్ సంగ్వాన్, అంతర్జాతీయ రెజ్లర్, బీజేపీ నేత బబితా ఫొగాట్, మాజీ ఎమ్మెల్యే రణవీర్ మండోలా, మాజీ ఎమ్మెల్యే కల్నల్ రఘుబీర్ చిల్లార్ సహా పలువురు రాజకీయ నేతలు మను సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ గౌరవాన్ని తన జీవితాంతం గుర్తుంచుకుంటానని మను బాకర్ వెల్లడించింది.
కాగా, 2024 పారిస్ ఒలింపిక్స్‌లో మను బాకర్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్, 10 మీటర్ల మిక్స్‌డ్ డబుల్స్‌లో కాంస్య పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించింది. ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది.
పెళ్లి గురించి ప్రశ్న - సిగ్గుపడుతూ మను బాకర్ ఏం చెప్పిందంటే? - Manu Bhaker Marriage 'ఆ క్రికెటర్లు అంటే నాకు చాలా ఇష్టం - ఆయన మాత్రం ఇన్స్పిరేషన్' - Manu Bhaker Favourite Cricketer