Manoj Tiwary Team India : టీమ్ఇండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ ఇటీవలే అన్ని ఫార్మట్లకు రిటైర్మెంట్ తెలిపారు. గత కొంత కాలంగా క్రికెట్‌కు దూరంగా ఉన్న ఆయన ప్రస్తుతం రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంటున్నసంగతి తెలిసిందే. ఆయన ఇప్పుడు బంగాల్ క్రీడా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపడ్తున్నారు. అయితే ఇటీవలే రంజీ ట్రోఫీలో బంగాల్ తరఫున ఆడాడు.
ఈ నేపథ్యంలో తాజాగా బిహార్‌తో చివరి మ్యాచ్‌లో తన రిటైర్మెంట్ ప్రకటించారు. ఆ తర్వాత కోల్‌కతా స్పోర్ట్స్ జర్నలిస్ట్స్ క్లబ్‌లో జరిగిన ఓ సన్మాన సభలో పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వల్లనే తన కెరీర్ నాశనమైందని ఆయన వ్యాఖ్యనించారు. 2011లో భారత్ తరఫున సెంచరీ చేసిన తర్వాత కూడా తనను తుది జట్టు నుంచి తప్పించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవేళ ధోని తనను తొలగించకపోతే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలా అత్యుత్తమ బ్యాటర్‌గా తాను అయ్యేవాడంటూ చెప్పుకొచ్చారు. అంతే కాకుండా ఈ విషయంపై ధోనీ ఏదో ఒక రోజు తనకు వివరణ ఇవ్వాల్సిందే అని అన్నారు.