VVS Laxman Teamindia Head coach :టీమ్ ఇండియా కోచ్ పదవికి అప్లికేషన్ గడువు మే 27 సమీపిస్తోంది. ఈ రోల్‌కు ఎవరు దరఖాస్తు చేసుకున్నారు? ఎవరిని బీసీసీఐ ఎంపిక చేయనుందనే అంశాలపై చాలా ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఎన్‌సీఏ 'హెడ్ ఆఫ్ క్రికెట్'గా లక్ష్మణ్ పదవీ కాలం ముగుస్తుంది. దీంతో ఆ తర్వాత అతడిని బీసీసీఐ ఎలా ఉపయోగించుకుంటుందనే విషయంపై క్రికెట్ ప్రియుల్లో ఆసక్తి నెలకొంది. వాస్తవానికి ఎన్‌సీఏలో పని చేస్తున్న లక్ష్మణ్‌కు తాత్కాలిక భారత కోచ్‌గా పని చేసిన అనుభవం కూడా ఉంది. ద్రవిడ్ తర్వాత కోచ్ అయ్యే అర్హత అతనికే ఎక్కువగా ఉంది. కానీ అతడు మాత్రం ఇప్పటి వరకు పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకోలేదని తెలుస్తోంది. మరోవైపు అతడి పేరు మాత్రం ఈ హెడ్ కోచ్ పదవికి బాగా ప్రచారం సాగుతోంది.
- వీవీఎస్ లక్ష్మణ్‌ను ఒప్పిస్తారా?
లక్ష్మణ్ ఒక వేళ దరఖాస్తు చేసుకుంటే అతనికే మొదటి ప్రయారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. బీసీసీఐ కూడా అతడినే కోరుకుంటున్నట్లు సమాచారం. బోర్డు అతడిని ఒప్పించే ప్రయత్నాలు చేస్తుందని క్రికెట్ వర్గాలు అంటున్నాయి. ఒకవేళ నిజంగానే అతడిని ఎంపిక చేసినా మే 27 నుంచి సెప్టెంబర్(ఎన్‌సీఏ హెడ్‌గా లక్ష్మణ్ పదవి కాలం ముగింపు) వరకు ఎలా మేనేజ్ చేస్తారని మరో ఆసక్తికర విషయం.
అయితే లక్ష్మణ్ ఎంపికపై బీసీసీఐ మాజీ ఆఫీస్ బేరర్ మాట్లాడుతూ - "ఇది పూర్తిగా జైషాపైనే ఆధారపడి ఉంటుంది. వీవీఎస్‌ను పూర్తి స్థాయిలో కాకపోయినా కనీసం ఇండియన్ సెటప్‌లో భాగమయ్యేలా చూడాలి. ఒకవేళ లక్ష్మణ్ అయినా పూర్తి సమయం పనిచేయడానికి ఇష్టపడకపోతే ఈ సంవత్సరం ఆస్ట్రేలియా, వచ్చే ఏడాది ఇంగ్లాండ్‌లో భారత్ కీలక రెడ్-బాల్ సిరీస్‌లు ఆడేటప్పుడు సలహాదారుగా ఉండేలా కోరాలి. మరోవైపు లక్ష్మణ్‌కు NCA పదవీకాలం ముగిసిన తర్వాత IPL ఫ్రాంచైజీల నుంచి ఆఫర్లు ఎదురు చూస్తుంటాయి. ఎందుకంటే లక్ష్మణ్ కామెంటేటర్ కమ్ అనలిస్ట్‌గా కూడా సేవలు అందించగలడు" అని చెప్పాడు. కాగా, ఇటీవల ముంబయిలో మీడియా ఇంటరాక్షన్ సందర్భంగా జాతీయ జట్టుకు ఒకే ప్రధాన కోచ్ మాత్రమే ఉంటారని షా స్పష్టం చేశాడు. అయితే రెడ్-బాల్ క్రికెట్‌లో లక్ష్మణ్‌కు ఉన్న నైపుణ్యాన్ని ఉపయోగించుకోవాలనే ఆలోచన ఉన్నట్లు కూడా పేర్కొన్నాడు.
- గంభీర్ ఏకగ్రీవం అవుతాడా?
ప్రస్తుతం ఇండియా కోచ్‌గా బీసీసీఐకి ఉన్న బెస్ట్ ఆప్షన్ కోల్‌కతా నైట్ రైడర్స్ మెంటర్ గౌతమ్ గంభీర్ అని కూడా కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అయితే గంభీర్‌ను ఏకగ్రీవంగా ఎంపిక చేయడంపై టీమ్ ఇండియా సీనియర్ ప్లేయర్‌లతో బీసీసీఐ సెక్రటరీ జే షా మాట్లాడారా? లేదా? అనే అంశంపై స్పష్టత లేదు.
- లక్ష్మణ్ తర్వాత హెడ్ ఆఫ్ క్రికెట్ ఎవరు?
వచ్చే ఏడాది నాటికి NCA ప్రధాన కార్యాలయం బెంగళూరు శివార్లలో మల్టిపుల్ ఫుల్ సైజ్డ్ క్రికెట్ మైదానాలు, అత్యాధునిక వ్యాయామశాల, స్విమ్మింగ్ పూల్, నివాస సముదాయంతో ఓపెన్ కానుంది. లక్ష్మణ్ NCAకు వీడ్కోలు పలికిన తర్వాత హెడ్ ఆఫ్ క్రికెట్ పదవికి గట్టి అభ్యర్థి కావాలి. లక్ష్మణ్ తర్వాత ప్రస్తుత జాతీయ జట్టు బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్‌ను పరిశీలిస్తారని తెలుస్తోంది. రాథోర్ ప్రస్తుతం NCAలో బ్యాటింగ్ కోచ్‌గా ఉన్నాడు. నాలుగు సంవత్సరాలు జాతీయ సెలెక్టర్‌గా కూడా పని చేశాడు. గత ఐదు సంవత్సరాలుగా జాతీయ జట్టుతోనే ఉన్నాడు. అయితే అతడి పదవీకాలం కూడా వచ్చే నెల T20 ప్రపంచ కప్‌తో ముగుస్తుంది.