Lakshya Sen Paris Olympics 2024 :పారిస్ ఒలింపిక్స్‌లో భాగంగా తాజాగా జరిగినబ్యాడ్మింటన్ సెమీస్‌లో లక్ష్య సేన్ ఘోర పరాజయం పాలయ్యాడు. డెన్మార్క్ ప్లేయర్ అక్సెల్సన్ చేతిలో 20-22, 14-21 తేడాతో ఓటమిని చవిచూశాడు. అయితే ఆగస్టు 5న జరగనున్న కాంస్య పతక పోరులో మలేసియా ప్లేయర్ లీ జీ జియాతో తలపడనున్నాడు.
మ్యాచ్ సాగిందిలా :
ఎంతో ఉత్కంఠగా జరిగిన ఈ పోరులో తొలి గేమ్ ఆరంభంలోనే వెనుకబడినట్లు కనిపించిన లక్ష్యసేన్, ఆ తర్వాత వేగం పుంజుకున్నాడు. ఒకానొక దశలో 15-11తో ఆధిక్యంలో నిలిచాడు. అయితే అక్సెల్సెన్ క్రమంగా తన జోరును పెంచాడు. దీంతో లక్ష్యసేన్ మూడు గేమ్ పాయింట్‌లను వృథా చేసుకున్నాడు.
మరోవైపు అక్సెల్సెన్ వరుసగా ఐదు పాయింట్లు సాధించి ఈ గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. రెండో సెట్‌లో లక్ష్యసేన్ 7-0తో భారీ ఆధిక్యాన్ని కనబరిచినప్పటికీ ఆ తర్వాత ప్రత్యర్థి గేమ్ చూసి తేలిపోయాడు. ఇక డెన్మార్క్ షట్లర్ కూడా జోరు పెంచి వరుసగా పాయింట్లు సొంతం చేసుకున్నాడు. గట్టిగా పోటీనిచ్చి గేమ్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు.
ఈ పోటీల్లోనూ నిరాశే
మరోవైపు ఆదివారం వివిధ పోటీల్లోనూ భారత్‌కు నిరాశే ఎదురైంది. షూటింగ్ స్కీట్ మహిళల క్వాలిఫికేషన్‌లో మహేశ్వరి చౌహాన్, రైజా ధిలాన్ ఓటమిపాలయ్యారు. ఐదు రౌండ్లలో మహేశ్వరి 118 పాయింట్లు (14వ స్థానం), ధిలాన్ 113 పాయింట్లు (23వ స్థానం) నిలిచారు. అయితే మొదటి ఆరు స్థానాల్లో ఉన్నవారు ఫైనల్‌కు అర్హత సాధిస్తారు. దీంతో ఈ ఇద్దరూ వెనుతిరిగారు.