Harshit Rana Flying Kiss:కోల్‌కతా నైట్‌రైడర్స్ బౌలర్ హర్షిత్ రానా 2024 ఐపీఎల్లో తన పెర్ఫార్మెన్స్ కంటే ఫ్లైయింగ్ కిస్తోనే ఎక్కువ ఫేమస్ అయ్యాడు. లీగ్‌లో 19 వికెట్లు తీసిన దానికంటే, సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో అతడి ఫ్లైయింగ్ కిస్ సెలబ్రేషనే ఎక్కువ మందికి గుర్తుంది. ఆ మ్యాచ్‌లో మయాంక్ అగర్వాల్‌ను ఔట్ చేసిన రానా, వికెట్ సెలబ్రేట్ చేసుకుంటూ ఒక ఫ్లైయింగ్ కిస్ ఇచ్చాడు. దీంతో ఐపీఎల్ నిర్వాహకులు అతడిపై చర్యలు తీసుకున్నారు. మ్యాచ్ ఫీజులో 60 శాతం కోత విధించారు. అయితే ఈ ఘటన గురించి తాజాగా హర్షిత్ రానా ఓ పోడ్‌కాస్ట్‌లో మాట్లాడాడు. ఆ ఇన్సిడెంట్ తర్వాత ఎదురైన అంశాలు, తనలో వచ్చిన మార్పుల గురించి వివరించాడు.
'ఆ రోజు నేను ఉద్దేశపూర్వకంగా ఫ్లైయింగ్ కిస్ ఇవ్వలేదు. మయాంక్ భయ్యా వికెట్ తీసినప్పుడు, బాల్ వేసిన వేగాన్ని నియంత్రించుకునే క్రమంలో సాధారణంగానే అతనికి దగ్గరిగా వెళ్లాను. వికెట్ తీసిన ఆనందంలో సహజంగానే ఫ్లైయింగ్ కిస్ ఇచ్చాను. మయాంక్‌కి నాకు మధ్య అంతకు ముందు కొన్ని ఘటనలు జరిగాయి. దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లో కూడా కొంచెం సరదాగా ఒకరినొకరు మాటలు అనుకున్నాం. ఫ్లైయింగ్ కిస్ తర్వాత చాలా మార్పులు వచ్చాయి. ప్రేక్షకులు నా దగ్గరకు వచ్చినప్పుడు, దాని గురించే అడుగుతున్నారు. అలానైనా నేను అందరికీ గుర్తున్నానని ఆనందంగా ఉండేది' అని అన్నాడు.
ఈ విషయంలో టీమ్ ఓనర్ షారూక్ ఖాన్, టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ నుంచి కూడా తనకు మద్దతు లభించిందని రానా పేర్కొన్నాడు. 'నువ్వు ఎంజాయ్ చేస్తుంటే, ఆ పని చేస్తూనే ఉండు. అందులో తప్పు లేదు' అని రోహిత్ చెప్పినట్లు తెలిపాడు. 'రోహిత్ భయ్యాకు బ్యాటింగ్‌లో గ్రేట్ టైమింగ్ ఉంది. ప్రపంచంలో ఏ బౌలర్ కూడా అతడిని పేస్‌తో ఓడించలేడు. అందుకే ఫాస్ట్ బౌలర్లు ఎల్లప్పుడూ అతడి ముందు ఓ అడుగు వెనకే ఉంటారు' అని చెప్పాడు.