Kohli Nickname Chiku :మనందరిలాగే స్టార్ క్రికెటర్లకు ముద్దు పేర్లు ఉంటాయి. వారికి చిన్నప్పటి నుంచి ఉండే ముద్దు పేర్లు అప్పుడప్పుడూ ఇంటర్వ్యూలు, మ్యాచ్ జరుగుతున్న సమయంలో బయటపడుతుంటాయి. టీమ్‌ఇండియా స్టార్ బ్యాటర్ కోహ్లీని 'చీకు' అని పిలుస్తారని తెలిసిందే. అయితే ఈ పేరు ఎందుకు వచ్చిందో మీకు తెలుసా? దీని వెనకున్న ఆసక్తికరమైన కథ తెలుసుకుందాం పదండి.
చీకు అనే పేరు ఎందుకొచ్చిందంటే? -'చీకు' అనే పేరు కోహ్లీ దిల్లీ తరఫున డొమెస్టిక్ క్రికెట్ ఆడుతున్న తొలి రోజుల్లో వచ్చింది. 2007సో రంజీ ట్రోఫీ సమయంలో తన జుట్టు ఊడిపోతోందనే ఉద్దేశంతో కోహ్లీ పొట్టిగా జుట్టు కత్తిరించుకున్నాడు. అప్పుడు కోహ్లీ బుగ్గలు పెద్దగా ఉండేవి. చిన్న జుట్టు వల్ల గుండ్రని ముఖం, చెవులు, బుగ్గలు పెద్దగా కనిపించేవి. దీంతో కోహ్లీ డొమెస్టిక్ క్రికెట్ కోచ్, ఇండియన్ చిల్ట్రెన్స్ మ్యాగజైన్ చంపక్‌లోని 'చీకు' అనే కుందేలు క్యారక్టెర్‌తో కోహ్లీని సరదాగా పోల్చాడు. కేవలం కోహ్లీ రూపం వల్ల మాత్రమే కాదు మైదానంలో వేగంగా తిరగడం, యాక్టివ్‌గా ఉండటం వల్ల ఆ పేరు వచ్చింది. అప్పటి నుంచి కోహ్లీకి సన్నిహితంగా ఉండే వాళ్లు చీకు అని పిలిచేవారు.
ధోనీ వల్ల పాపులర్ - అయితే కోహ్లీ 'చీకు' పేరు ఫ్యాన్స్‌కు తెలియడానికి భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని కారణం. కోహ్లీకి 'చీకు' అనే పేరు డొమెస్టిక్ క్రికెట్‌లో వచ్చినప్పటికీ, అంతర్జాతీయ క్రికెట్‌లో ఆ పేరు పాపులర్ అవ్వడానికి మహీనే కారణమని తెలిసింది. ఎందుకంటే మ్యాచ్‌ల సమయంలో, ధోనీ తరచుగా స్టంప్‌ల వెనుక నుంచి కోహ్లీని 'చీకూ' అని పిలుస్తుండేవాడు. పిచ్ దగ్గర ఉండే మైక్రోఫోన్‌లలో ఇది చాలా సార్లు రికార్డు అయింది. అప్పటి నుంచి అభిమానులు కోహ్లీని 'చీకు' అనడం ప్రారంభించారు.