Vijay Hazare Trophy 2025 :2025 విజయ్ హజారే ట్రోఫీ టైటిల్‌ను కర్ణాటక జట్టు చేజిక్కించుకుంది. శనివారం విదర్భతో వడోదర వేదికగా జరిగిన ఫైనల్లో కర్ణాటక 36 పరుగుల తేడాతో నెగ్గి ఐదోసారి ఛాంపియన్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌లో కర్ణాటక నిర్దేశించిన 349 పరుగులు ఛేదనలో విదర్భ 48.2 ఓవర్లలో 312 పరుగులకు ఆలౌటైంది. ధ్రువ్ షోరే (110 పరుగులు; 111 బంతుల్లో 8x4, 2x6) శతకంతో చెలరేగినా విదర్భకు ఓటమి తప్పలేదు. కర్ణాటక బౌలర్లలో వాసుకి కౌశిక్, ప్రసిధ్ కృష్ణ, అభిలాష్ శెట్టి తలో 3 వికెట్లు పడగొట్టగా హార్దిక్ రాజ్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.
భారీ ఛేదనలో విదర్భ స్కోర్ బోర్డు ముందుకు కదులుతున్నప్పటికీ వికెట్లు క్రమంగా పడ్డాయి. ఓ వైపు ఓపెనర్ ధ్రువ్ షోరే నిలకడగా ఆడినా అతడికి మద్దతు కరవైంది. యశ్ రాథోడ్ (22 పరుగులు), కరుణ్ నాయర్ (27 పరుగులు), జితేశ్ శర్మ (34 పరుగులు) భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. చివర్లో హర్ష్ దుబే (63 పరుగులు) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. చివర్లో పోరాడిన హర్ష్ దూబే మ్యాచ్‌పై ఆశలు రెకెత్తించినా, మరో ఎండ్‌లో వికెట్లు పడ్డాయి. ఇక అభిలాశ్ శెట్టి బౌలింగ్‌లో హర్ష్ దూబే క్యాచ్ ఔట్ అవ్వడంతో మ్యాచ్ ముగిసింది.
పాపం కరుణ్!
విదర్భ కెప్టెన్ కరుణ్ నాయర్ ఒంటిచేత్తో జట్టను ఫైనల్ దాకా తీసుకువచ్చాడు. భారీ ఛేదనలో కరుణ్ (27 పరుగులు) ఆకట్టుకోలేకపోయాడు. అయితే ఈ ఎడిషన్‌లో మాత్రం అత్యధిక రన్ స్కోరర్‌గా నిలిచాడు. 8 మ్యాచ్‌ల్లో కరుణ్ 779 పరుగులతో టోర్నీని ముగించాడు.