Kamran Akmal Praises BCCI :ప్రపంచ క్రికెట్లో పాకిస్థాన్ జట్టు పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతోంది. గత కొంతకాలంగా ఆ జట్టు వరుసగా పరాజయాలు చవిచూస్తూ, ఇంటా బయటా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. పలుమార్లు కెప్టెన్‌తోపాటు ఏకంగా జాతీయ క్రికెట్ బోర్డులో పెను మార్పులు చేసినా, ఆటగాళ్లకు కఠినమైన ఆర్మీ ట్రైనింగ్ ఇచ్చినా పాక్ పరిస్థితి మెరుగు పడలేదు.
అయితే ఈ వైఫల్యానికి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రధాన కారణమని ఆ జట్టు మాజీ ప్లేయర్ కమ్రాన్ అక్మల్ అన్నాడు. బోర్డులో కొందరి అహం (Ego) వల్ల పాక్ క్రికెట్‌కు ఈ పరిస్థితి వచ్చిందని అభిప్రాయపడ్డాడు. జాతీయ క్రికెట్ బోర్డును ఎలా నడిపించాలో బీసీసీఐని చూసి పీసీబీ (Pakistan Cricket Board) నేర్చుకోవాలని తెలిపాడు. బీసీసీఐ క్రమశిక్షణతో బోర్డును నడుపుతూ జట్టును పటిష్ఠంగా తయారు చేసుకుంటుందని రీసెంట్గా తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడాడు.
'బీసీసీఐని చూసి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చాలా నేర్చుకోవాలి. జట్టు ఎంపిక విధానం, కెప్టెన్, కోచ్ విషయంలో బీసీసీఐ ప్రొఫెషనల్‌గా ఉంటుంది. ఇవి బీసీసీసీఐ నుంచి పీసీబీ నేర్చుకోవాలి. ఈ అంశాలే ప్రపంచ క్రికెట్లో జట్టును నెం. 1 గా నిలబెడతాయి. మననంతా (పీసీబీ) బాగుంటే పాకిస్థాన్ క్రికెట్‌కు ఈ పరిస్థితి వచ్చేది కాదు. కొందరి అహంకారం వల్ల పాక్ క్రికెట్ దెబ్బ తింటోంది' అని కమ్రాన్ అక్మల్ అన్నాడు.