Jasprit Bumrah T20 World Cup 2024 : జట్టు ఓటమి అంచుల్లో ఉన్నప్పుడు మ్యాచ్‌ను తలకిందులు చేయగలడతడు. ఏ ఫార్మాట్ అయిన అతడొస్తే మ్యాచ్ ఉత్కంఠ భరితంగా మారుతుంది. ప్రత్యర్థి బ్యాటర్లు చెలరేగితే, మ్యాచ్ చేజారే పరిస్థితి వస్తే అతను బౌలింగ్‌కు రావాల్సిందే! అతడే టీమ్ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా. ప్రపంచంలోనే మేటి పేసర్లలో ఒకడైన బుమ్రా, తన కంటే వెయ్యి రెట్లు నయం అని దిగ్గజం కపిల్ దేవ్ అన్నాడంటేనే అతడి కెపాసిటీని అర్థం చేసుకోవచ్చు. ప్రపంచంలోని మేటి క్రికెటర్లంతా అహో బుమ్రా అని పొగుడుతున్నారంటేనే అతని బౌలింగ్ ఎంతటి అద్భుతమో తెలుస్తోంది. అక్షరాల ఆ మాటలనే నిజం చేస్తూ శనివారం దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20వరల్డ్ కప్ ఫైనల్లో ఆపద్బాంధవుడిలా జట్టును కాపాడాడు. ఐసీసీ టైటిళ్ల కోసం టీమ్ఇండియా సుదీర్ఘ నిరీక్షణకు ముగింపు పలకడంలో కీలక పాత్ర పోషించి 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్'గా నిలిచాడు.
అయితే, కేవలం వికెట్లు తీయడమే కాదు పరుగులు కట్టడి చేసి బ్యాటర్లను ఒత్తిడిలోకి నెట్టడం బుమ్రాకు బంతితో పెట్టిన విద్య. ఆఫ్‌స్టంప్‌కు కాస్త ఆవల బంతి వేసి దాన్ని రివ్వుమని లోపలికి స్వింగ్ చేసి బ్యాటర్లకు అందకుండా బుమ్రా స్టంప్స్‌ను లేపేస్తుంటే చూడ్డానికి రెండు కళ్లు చాలవు. ఇక పరిస్థితులకు తగ్గట్లుగా, బ్యాటర్ల బలహీనతను బట్టి షార్ట్‌పిచ్ బంతులు, యార్కర్లు వేయడంలోనూ బుమ్రా ఎక్స్పర్ట్.
ఈ టోర్నీలో 8 మ్యాచ్‌ల్లో 15 వికెట్లతో బుమ్రా అదరహో అనిపించాడు. అతడి సగటు 8.26 మాత్రమే. ఎకానమీ 4.17. పాకిస్థాన్‌పై 3, అఫ్గానిస్థాన్‌పై 3, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికాపై రెండేసి వికెట్లతో అదరగొట్టాడు. ముఖ్యంగా తుదిపోరులో ఓటమి దిశగా సాగుతున్న జట్టును 18 ఓవర్లో రెండు పరుగులే ఇచ్చి, ఓ వికెట్ తీసి బుమ్రా గెలుపు వైపు మళ్లించాడు.