Sanju Samson Vijay Hazare Trophy : త్వరలో మొదలుకానున్న విజయ్ హజారే ట్రోఫీలో మరో స్టార్ బ్యాటర్‌కి చోటు దొరకలేదు. ఇప్పటికే పృథ్వీ షాని ముంబయి పక్కన పెట్టగా, ఇప్పుడీ జాబితాలో టీమ్‌ఇండియా స్టార్ ప్లేయర్ సంజు శాంసన్ చేరాడు. మూడు రోజుల కేరళ క్రికెట్ అసోసియేషన్ (కేసీఏ) క్యాంప్‌కు హాజరుకానందున విజయ్ హజారే కేరళ జట్టు నుంచి సంజు శాంసన్‌ని పక్కన పెట్టారు.
సంజు శాంసన్ ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కేరళకు నాయకత్వం వహించాడు. అంతకు ముందు మూడు టీ20 సెంచరీలతో అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. కానీ క్రమశిక్షణ చర్యల్లో భాగంగా కేరళ క్రికెట్ బోర్డు అతడిపై వేటు వేసింది.
సంజు శాంసన్ లేకపోవడంతో సల్మాన్ నిజార్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. గాయం కారణంగా అనుభవజ్ఞుడైన బ్యాటర్ సచిన్ బేబీని కూడా జట్టులోకి తీసుకోలేదు. సన్నాహక శిబిరానికి ముందు 30 మంది సభ్యుల జాబితాలో సంజు శాంసన్ ఉన్నాడు. కానీ అతడు శిబిరానికి హాజరు కాలేదు. రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌ల తర్వాత జట్టును 19కి తగ్గించారు.
శాంసన్‌పై కఠినంగా వ్యవహరిస్తున్న బోర్డు
ఈ అంశంపై కేసీఏ సెక్రటరీ, వినోద్ ఎస్ కుమార్ స్పందించారు. ఓ ప్రముఖ న్యూస్ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. క్యాంప్‌కి అందుబాటులో ఉండలేకపోతున్న అంశాన్ని సంజు శాంసన్ ఈమెయిల్ ద్వారా బోర్డుకి తెలిపినట్లు చెప్పారు. క్యాంప్‌లో భాగమైన ఆటగాళ్లను మాత్రమే తాము పరిగణనలోకి తీసుకున్నామని, సంజు శాంసన్‌తో తదుపరి చర్చలు జరపలేదని పేర్కొన్నారు.
ఒకవేళ సంజు శాంసన్ విజయ్ హజారే ట్రోఫీకి పూర్తిగా దూరమైతే, అది అతడికి పెద్ద దెబ్బ. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ కొన్ని నెలల్లో ప్రారంభం కానుంది. టీమ్‌ఇండియాలో చోటు కోసం పోటీ పడుతున్న ఆటగాళ్లలో సంజు శాంసన్ కూడా ఉన్నాడు. విజయ్ హజారేలో అతడు మంచి ప్రదర్శన చేసుంటే, ఛాంపియన్స్ ట్రోఫీ ఆడే అవకాశాలు పెరిగేవి. ఇప్పుడు శాంసన్‌కి పరిస్థితులు మరింత కఠినంగా మారాయి.
2024 విజయ్ హజారే ట్రోఫీ కేరళ జట్టు
సల్మాన్ నిజార్ (కెప్టెన్), రోహన్ ఎస్ కున్నుమ్మల్, షోన్ రోజర్, మహ్మద్ అజారుద్దీన్ ఎమ్ (వికెట్ కీపర్), ఆనంద్ కృష్ణన్, కృష్ణ ప్రసాద్, అహ్మద్ ఇమ్రాన్, జలజ్ సక్సేనా, ఆదిత్య సర్వతే, సిజోమన్ జోసెఫ్, బాసిల్ థంపి, అజ్నాస్ ఎం (వికెట్ కీపర్) బాసిల్ ఎన్‌పీ, నిధీష్ ఎండీ, ఈడెన్ ఆపిల్ టామ్, షరాఫుద్దీన్ ఎన్‌ఎం, అఖిల్ స్కారియా, విశ్వేశ్వర్ సురేష్, వైశాక్ చంద్రన్.