Jasprit Bumrah Back Injury :ఆస్ట్రేలియా వేదికగా జరిగిన బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో టీమ్ఇండియా ఓటమిని చవి చూసింది. అయితే ఆ టెస్ట్ చివరి మ్యాచ్‌లో రాణిస్తాడనుకున్న జస్ప్రీప్ బుమ్రా అనూహ్యంగా మైదానం వీడి అందరినీ షాక్‌కు గురి చేశాడు. వెన్నునొప్పి కారణంగా ఇబ్బంది పడ్డ అతడు, అక్కడి వైద్య సిబ్బందితో స్కానింగ్‌కు వెళ్లాడు. కానీ ఆ పరీక్షల్లో అతడి గాయం తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తెలియడం వల్ల రెండో ఇన్నింగ్స్‌కు మళ్లీ ఆటలోకి రాలేదు.
దీంతో రానున్న ఛాంపియన్స్ ట్రోఫీకి బుమ్రా దూరం కానున్నాడంటూ పలు వార్తలు ట్రెండ్ అయ్యాయి. వెన్ను గాయంతో బాధపడుతున్నందున బుమ్రాను బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిందిగా డాక్టర్లు సూచించారని, అందుకే ఛాంపియన్స్ ట్రోఫీలో అతడు వచ్చేది అనుమానమే అంటూ ఆ వార్తల సారాంశం. కానీ తాజాగా ఈ రూమర్స్‌పై బుమ్రా స్వయంగా స్పందించాడు. ఆ వార్తల్లో ఎటువంటి వాస్తవాలు లేవంటూ కొట్టిపారేశాడు. ఫేక్ న్యూస్ చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుంటుందని కౌంటర్ ఇచ్చాడు.
"ఫేక్ న్యూస్ వ్యాప్తి చేయడం చాలా సులువు. ఆ విషయం నాకు బాగా తెలుసు. అయితే ఈ న్యూస్ నాకు నవ్వు తెప్పించింది.ఆ రిపోర్ట్స్ అన్నీ ఫేకే" అంటూ నవ్వు ఎమోజీలను ఆ పోస్ట్‌కు జత చేశాడు. ఇది చూసి ఫ్యాన్స్ ఊరట చెందారు. అయినప్పటికీ 'గెట్ వెల్ సూన్ బుమ్రా', 'కమ్ బ్యాక్ సూన్' అంటూ కామెంట్లు పెడుతున్నారు.