IVPL 2024 Chris Gayle : ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్ 2024 ఎడిషన్‌లో వెస్టిండీస్ మాజీ ప్లేయర్, తెలంగాణ టైగర్స్ ఆటగాడు క్రిస్ గేల్ చెలరేగి ఆడుతున్నాడు. వీవీఐపీ ఉత్తర్‌ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో యూనివర్సల్ బాస్ సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో 46 బంతులు ఎదుర్కొన్న అతడు 3 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో 94 పరుగులు సాధించాడు. అయితే గేల్ విధ్వంకర ఇన్నింగ్స్‌తో చెలరేగినప్పటికీ తన జట్టు తెలంగాణ టైగర్స్‌కు విజయాన్ని అందించలేకపోయాడు.
వివరాల్లోకి వెళితే. ఈ మ్యాచ్‌లో మొదట ఉత్తర్‌ప్రదేశ్ బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి ఏకంగా 269 పరుగులు చేసింది. పవన్ నేగి విధ్వంసకర శతకంతో చెలరేగాడు. 56 బంతుల్లో 16 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 139 పరుగులు చేశాడు. అన్షుల్ కపూర్ 45 బంతుల్లో 71; 7 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో మెరుపు అర్దశతకం సాధించగా - చివర్లో కెప్టెన్ సురేశ్ రైనా 13 బంతుల్లో 5 ఫోర్లు మెరుపు వేగంతో 27 పరుగులు సాధించాడు.
అనంతరం ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన తెలంగాణ టైగర్స్ నిర్ణీత ఓవర్లలో 224 పరుగులు మాత్రమే చేసింది. క్రిస్ గేల్ ధనాధన్ ఇన్నింగ్స్‌తో విజృంభించినప్పటికీ విజయం సాధించలేకపోయింది. ఉత్తర్‌ప్రదేశ్ నిర్ధేశించిన లక్ష్యానికి 46 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఇక ఆఖర్లో శశకాంత్ రెడ్డి (39), కమలేశ్ (46 నాటౌట్) తెలంగాణను గెలిపించేందుకు ప్రయత్నించినా వారి వల్ల కాలేదు. యూపీ బౌలర్లలో క్రిస్ మోఫు 5 వికెట్లు తీశాడు.