Cricket Banned City:గతంలో కొన్ని దేశాలకే పరిమితమైన క్రికెట్ ఇప్పుడు ప్రపంచమంతా వ్యాపించింది. చిన్నపిల్లల నుంచి నడివయసు వాళ్ల వరకూ సమయం దొరికితే చాలు బ్యాట్, బాల్ తీసేస్తుంటారు. గల్లీల్లో, ఇరుకు వీధుల్లో బుల్లి క్రికెటర్లు ఎందరో మనకు కనిపిస్తుంటారు. ఈ టీ20ల యుగంలో క్రికెట్ మరింత పాపులర్ అయిపోయింది. అయితే ఇటలీలోని ఓ నగరం క్రికెట్ పై బ్యాన్ విధించింది. ఒకవేళ తమ మాటను ఉల్లంఘించి క్రికెట్ ఆడితే జరిమానా వేస్తామని ప్రకటించింది. ఇంతకీ కారణం ఏంటంటే?
100 యూరోల జరిమానా!
ఉత్తర ఇటలీలోని మోన్ ఫాల్కోన్ పట్టణం క్రికెట్ పై బ్యాన్ విధించింది. ఒకవేళ ఈ కట్టుబాటును ఉల్లంఘించి క్రికెట్ ఆడినవారికి 100 యూరోలు (భారత కరెన్సీలో రూ. 9,325) వరకు జరిమానా వేస్తామని హెచ్చరించింది. ఈ విషయాన్ని మోన్ ఫాల్కోన్ పట్టణ మేయర్ అన్నా మారియా సిసింట్ ప్రకటించారు. ఈ మేరకు బీబీసీ ఓ కథనాన్ని ప్రచురించింది.
30 వేల మంది జనాభా
ఇక ఇటలీలోని మోన్ ఫాల్కోన్ అనే పట్టణం ప్రకృతి అందాలకు నెలవు. ఈ నగరంలో సుమారు 30,000 మంది జనాభా నివసిస్తున్నారు. అందులో మూడింట ఒక వంతు మంది విదేశీయులే కావడం గమనార్హం. విదేశీయుల్లో ఎక్కువ మంది బంగ్లాదేశ్ ముస్లింలే. వీరు 1990వ దశకం చివరలో ఇటలీలోని ఒక ప్రధాన షిప్ యార్డ్‌లో పని చేయడానికి వచ్చి మోన్ ఫాల్కోన్ నగరంలో స్థిరపడిపోయారు.