Ishan Kishan Re-Entry:భారత్- ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు ముగిసేసరికి ఇరుజట్లు 1-1తో సమానంగా ఉన్నాయి. ఇక మిగిలిన మూడు టెస్టు మ్యాచ్‌లపై ఇరుజట్లు దృష్టి సారించాయి. అయితే తదుపరి టెస్టులకు బీసీసీఐ భారత్ జట్టును ప్రకటించాల్సి ఉంది. ఈ క్రమంలో జట్టులోకి ఎవరు వస్తారు? ఎవరిపై వేటు పడనుంది? అనే ప్రశ్నలు తలెత్తున్నాయి. ఈ నేపథ్యంలో యంగ్ బ్యాటర్ ఇషాన్ కిషన్ టీమ్ఇండియాలో రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి!
అయితే మానసిక ఒత్తిడి కారణంగా సౌతాఫ్రికా పర్యటన నుంచి విశ్రాంతి కోరిన ఇషాన్ ఆ తర్వాత రెండు నెలన్నరగా జట్టుకు దూరమయ్యాడు. సౌతాఫ్రికా పర్యటన తర్వాత అఫ్గానిస్థాన్, ఇంగ్లాండ్‌తో రెండు టెస్టులకు బీసీసీఐ ఇషాన్‌ను పక్కనపెట్టింది. దీంతో తెలుగు తేజం శ్రీకర్ భరత్ జట్టులో చోటు దక్కించుకున్నాడు.కానీ, ఇంగ్లాండ్‌తో ఆడిన తొలి రెండు టెస్టుల్లో భరత్ నాలుగు ఇన్నింగ్స్‌ల్లోనూ విఫలమయ్యాడు. వరుసగా 41, 28, 17, 6 స్కోర్లు నమోదు చేశాడు. మరోవైపు కే ఎల్ రాహుల్ గాయంతో మిగిలిన టెస్టులకూ దూరం అయ్యాడు.
ఇక విశాఖపట్టణం టెస్టు తర్వాత టీమ్ఇండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ మీడియాతో మాట్లాడాడు. ఈ సెషన్లో ఇషాన్ రీ ఎంట్రీ గురించి అడగ్గా, 'ఇషాన్ కిషన్ డొమెస్టిక్ టోర్నీలో ఆడడం స్టార్ట్ చేయాలి. అప్పుడే అతడు సెలక్షన్లో ఛాయిస్‌గా ఉంటాడు. ఇప్పటికీ సెలక్షన్ కమిటీ, మేనేజ్మెంట్ ఇషాన్‌తో టచ్‌లోనే ఉంది' అని ద్రవిడ్ అన్నాడు. దీంతో వికెట్ కీపర్‌గా ఈ సిరీస్‌లోనే అతడి రీ ఎంట్రీ ఖాయమని ఫ్యాన్స్ అంటున్నారు.