Bowlers In Ipl Auction 2025 :2025 ఐపీఎల్ వేలం రెండో రోజు కొందరు భారత బౌలర్‌లపై డబ్బుల వర్షం కురిసింది. వేలంలో మొత్తం 10 ఫ్రాంచైజీలు భారత స్టార్ బౌలర్ కోసం పోటీ పడ్డాయి. భారత ఫాస్ట్ బౌలర్లు భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్ భారీ ధర పలికారు. వేలంలో ఏ భారత బౌలర్‌ని, ఏ టీమ్ ఎంతకు దక్కించుకుందో ఇప్పుడు చూద్దాం.
- భువనేశ్వర్ కుమార్ : టీమ్‌ఇండియా ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ వేలంలో భారీ ధర పలికాడు. భువీ చాలా ఏళ్లుగా సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతున్నాడు. ఈసారి అతడిని హైదరాబాద్ రిలీజ్ చేసింది. వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అతడిని రూ.10 కోట్ల 75 లక్షలకు కొనుగోలు చేసింది. దీంతో ఈ వేలంలో అమ్ముడుపోయిన అత్యంత ఖరీదైన భారత బౌలర్‌లలో ఒకడిగా భువనేశ్వర్ నిలిచాడు.
- దీపక్ చాహర్ : భారత్ ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్ కూడా రెండో రోజు వేలంలో లాభపడ్డాడు. గతంలో చాహర్ చాలా సీజన్‌లలో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడాడు. ఈ వేలంలో ముంబయి ఇండియన్స్ అతడిని రూ.9 కోట్ల 25 లక్షలకు కొనుగోలు చేసింది.
- ముకేశ్ కుమార్ : టీమ్ఇండియా రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ ముకేశ్ కుమార్‌ను అతడి మాజీ జట్టు దిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. దిల్లీ ముకేశ్ కోసం ఆర్‌టీఎం కార్డును ఉపయోగించింది. అతడిని రూ.8 కోట్లకు కొనుగోలు చేసింది.
- ఆకాశ్ దీప్ : డొమెస్టిక్ క్రికెట్‌లో అద్భుతంగా రాణించిన ఆకాశ్ దీప్ ఇటీవలే భారత టెస్టు క్రికెట్ జట్టులో స్థానం సంపాదించాడు. వేలంలో ఆకాశ్ దీప్‌ని లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ రూ.8 కోట్లకు సొంతం చేసుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అతిడి కోసం ప్రయత్నించింది. అయితే చివరకు లఖ్‌నవూ సొంతం చేసుకుంది.
- తుషార్ దేశ్‌పాండే : ఇటీవల టీమ్ఇండియా తరఫున టీ20 అరంగేట్రం చేసిన తుషార్ దేశ్‌పాండే కూడా మంచి ధర అందుకున్నాడు. గత సీజన్‌లో అతడు చెన్నై సూపర్ కింగ్స్‌లో అద్భుతంగా రాణించాడు. ఈ వేలంలో అతడిని రాజస్థాన్ రాయల్స్ రూ.6 కోట్ల 50 లక్షలకు కొనుగోలు చేసింది.