How Accused Caught In Saif Ali Khan Case : ఎవరైనా దొంగతనం వంటి నేరం చేస్తే ఏం చేస్తారు? ఎప్పుడు దొరికిపోతామో, పోలీసులు ఏం చేస్తారో అని బిక్కుబిక్కుమంటూ రహస్య ప్రాంతంలో నక్కి ఉంటారు! కానీ ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌పై దాడి చేసిన దొంగ మాత్రం గుర్రుగా నిద్రపోయాడు. అది కూడా అందరూ ఉండే బహిరంగ ప్రదేశంలో తెల్లవారే వరకు పడుకున్నాడు. అనంతరం తీరిగ్గా బయలుదేరాడు. అయితే నేరం చేసిన వెంటనే జనజీవనంలో కలిసిపోతే నన్నెవరూ పట్టుకోరు అనుకున్నాడో ఏమో, కానీ అతడు తిన్న పరోటా, వేసుకున్న బ్యాక్‌ప్యాక్ కారణంగా దొరికిపోయాడు. సైఫ్ అలీఖాన్ కేసులో నిందితుడ్ని పరోటా ఎలా పట్టించిందో ఇప్పుడు తెలుసుకుందాం.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం-- నిందితుడు షెహజాద్ దొంగతనం చేసేందుకు జనవరి 16న ముంబయిలోని బాంద్రాలో ఉన్న సైఫ్ అలీ ఖాన్ ఇంటికి వెళ్లాడు. చోరీ చేస్తున్న క్రమంలో సైఫ్‌ను వెనుక నుంచి పలు మార్లు కత్తితో పొడిచాడు. అనంతరం ఓ బస్‌స్టాప్‌లో గుర్రుగా నిద్రపోయాడు. మరుసటి రోజు ఉదయం 7 గంటలకు లేచి దుస్తులు మార్చుకుని బాంద్రా రైల్వే స్టేషన్‌కు, అక్కడి నుంచి దాదర్ వెళ్లాడు. అనంతరం వర్లీకి వెళ్లాడు. అక్కడ ఓ పని కాంట్రాక్టర్‌ను సంప్రదించి ఠాణే వెళ్లిపోయాడు.
బ్యాక్‌ప్యాక్‌తో కీలక లీడ్
ఇదిలా ఉండగా, ఈ హై ప్రొఫైల్ కేసులో నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు వేట ప్రారంభించి సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడి కోసం గాలించారు. ఈ క్రమంలో నిందితుడు ధరించిన బ్యాక్‌ప్యాక్ దర్యాప్తులో కీలక లీడ్ ఇచ్చింది. సీసీటీవీ ఫుటేజీల్లో నిందితుడిని గుర్తుపట్టడానికి బ్యాక్‌ప్యాక్ ఉపయోగపడింది.
బాంద్రా రైల్వే స్టేషన్‌లోని ఓ దుకాణంలో నిందితుడు ఒక మొబైల్ కవర్ కొన్నట్లు సీసీటీవు ఫుటేజీలో స్పష్టమైంది. అక్కడ షెహజాద్ డబ్బులు ఇచ్చాడు. దీంతో అక్కడి నుంచి నిందితుడు ఎక్కడికి వెళ్లాడో పోలీసుల వద్ద సమాధానం లేదు. అనంతరం, సీసీటీవీలో కనిపించిన నిందితుడి ముఖం ఆధారంగా మిగతా క్రిమినల్ రికార్డ్స్‌ను చెక్ చేశారు. నిందితుడిని పోలిన కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విడిచిపెట్టారు. కానీ అసలైన నిందితుడు దొరక లేదు.
మరోవైపు, నిందితుడికి పని ఇప్పించిన కాంట్రాక్టర్ పోలీసులకు షెషదాజ్ మొబల్ నంబర్ ఇచ్చాడు. ఆ మొబైల్‌ను ట్రాక్ చేసిన పోలీసులకు, నిందితుడు పరారీలో ఉన్నప్పుడు పలు మార్లు ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు చేసినట్లు తెలిసింది. సీసీటీవీ ఫుటేజీ, డంప్ డేటా (ఒక నెట్‌వర్క్‌లో రెండు సిస్టమ్‌ల మధ్య పెద్దమొత్తంలో ట్రాన్స్ఫర్ అయ్యే ఫైల్స్ లేదా డేటా), ఆన్ పేమెంట్ల డేటా సహాయంతో చివరికి నిందితుడిని పట్టుకున్నారు.
పరోటా పట్టించింది ఇలా!
నిందితుడు వర్లీలోని చిన్న దుకాణంలో ఒక పరోటా, నీళ్ల బాటిల్ కొనుగోలు చేశాడు. 'గూగుల్-పే'తో యూపీఐ ట్రాన్సాక్షన్ చేశాడు. ఈ ట్రాన్సాక్షన్ ఆధారంగా దర్యాప్తు కొనసాగించిన పోలీసులు శనివారం షెహజాద్‌ను అరెస్ట్ చేశాడు. నేరం జరిగిన మూడు రోజులకు నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు.
దక్షిణ బంగ్లాదేశ్‌లోని ఝాలోకథి జిల్లాకు చెందిన షెహజాద్ ముంబయికి వచ్చి, ఐదు నెలలుగా చిన్నాచితకా పనులు చేశాడు. ఈ క్రమంలోనే సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో దొంగతనం చేయడానికి వెళ్లాడు. ఇదిలా ఉండగా, నిందితుడిని ఐదు రోజులు పోలీసు కస్టడీకి అప్పగించింది కోర్టు. అంతర్జాతీయ కుట్ర జరిగిందనే పోలీసుల వాదనను తోసిపుచ్చలేమని కోర్టు అభిప్రాయపడింది. షెహజాద్‌పై భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్లు, పాస్‌పోర్ట్ చట్టంలోని నిబంధనల కింద కేసు నమోదైంది.