Wankhede 50th Anniversary Celebration : ముంబయి వాంఖడే స్టేడియం 50 సంవత్సరాల సెలబ్రేషన్స్ గ్రాండ్‌గా జరిగాయి. ఈ ఈవెంట్‌కు క్రికెట్ దిగ్గజాలు దిగ్గజాలు సునీల్ గావస్కర్, సచిన్ తెందూల్కర్, రవిశాస్త్రి, డయానా ఎడుల్జీ తదితరులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అలాగే టీమ్ఇండియా ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ కూడా కార్యక్రమానికి హాజరయ్యాడు. ఈ క్రమంలో సీనియర్ క్రికెటర్ రవిశాస్త్రి పట్ల రోహిత్ వ్యవహరించిన తీరు నెటిజన్లను ఆకట్టుకుంది. దీంతో సోషల్ మీడియాలో అతడిపై ప్రశంసలు కురుస్తున్నాయి. మరి రోహిత్ ఏం చేశాడంటే?
వాంఖడే స్టేడియం 50ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వారం రోజుల నుంచి ముంబయిలో మైదానం వార్షికోత్సవ కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం ఆ సంబరాలు ముగింపునకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ముంబయి క్రికెట్ అసోసియేషన్ ఓ గ్రాండ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ సభా వేదికపై మాజీ క్రికెటర్లు ఆశీనులయ్యారు. వారి కోసం స్టేజ్‌పై కాస్త గ్యాప్ ఇస్తూ, కుర్చీలను మూడువైపులా వేశారు.
అయితే రోహిత్ శర్మ స్టేజ్ మీదకు చేరుకునేటప్పటికే, గావస్కర్, సచిన్, ఎడుల్జీ కుడి వైపున కూర్చొని ఉన్నారు. రవిశాస్త్రి ఒక్కడే ఎడమ వైపున కూర్చొని ఉన్నాడు. ఈ మధ్యలో రెండు సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఇక రవిశాస్త్రి తన పక్కన ఉన్న సీటును చూపిస్తూ అందులోకి రావాలని రోహిత్‌కు సూచించాడు. అయితే రోహిత్ ఆ కార్నర్లో కాకుండా మధ్యలో ఖాళీగా ఉన్న కుర్చీపై కూర్చోవాలని రవిశాస్త్రిని కోరాడు. అలా మాజీ క్రికెటర్‌ను దిగ్గజాల మధ్యలో కూర్చోబెట్టి శాస్త్రి పక్కనే రోహిత్ ఆశీనులయ్యాడు.
Ravi Shastri was sitting in the corner but Rohit Sharma requested him to sit in the middle at Wankhade during event.🥹❤️
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) January 19, 2025
Oh captain my captain @ImRo45 🐐🫡 pic.twitter.com/fINRfxctff
దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో 'రోహిత్, నువ్వు సూపర్', 'ఇందుకే కదా నువ్వంటే మాకు ఇష్టం', 'మానవత్వం కలిగిన గొప్ప ఆటగాడు' అంటూ హిట్‌మ్యాన్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇక ఫిబ్రవరిలో ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీ గురించి రోహిత్ ఈ ఈవెంట్లో మాట్లాడాడు. 140 కోట్ల మంది ఆశలను దుబాయ్ తీసుకెళ్తున్నట్లు చెప్పాడు. మళ్లీ కప్పుతో తిరిగొచ్చి, ఇదే మైదానంలో సంబరాలు చేసుకుందమని తెలిపాడు. 'దుబాయ్‌లో జట్టు వెనక 140 కోట్ల మంది మద్దతు ఉంటుంది. మావంతు తీవ్రంగా శ్రమించి విజేతగా నిలిచేందుకు ప్రయత్నిస్తాం. మళ్లీ వాంఖడేకు ఛాంపియన్స్ ట్రోఫీని తీసుకొస్తాం' అని రోహిత్ పేర్కొన్నాడు.
రోహిత్ శర్మ, అజిత్ చాట్ లీక్! - మైక్ ఆన్‌లో ఉందని తెలియక ఆ మాట అనేశాడుగా!
కమ్‌బ్యాక్‌పై రోహిత్ ఫోకస్- నెట్స్ ప్రాక్టీస్ షురూ- వీడియో వైరల్