People Spending Huge Money On Marriages In India : పెళ్లంటే నూరేళ్ల పంట. జీవితంలో మధుర ఘట్టం. రెండు జీవితాలను, రెండు కుటుంబాలను ఏకం చేసే పవిత్ర ఘట్టం. అయితే, ప్రస్తుతం ఒకింటికి ఆడపిల్లను ఇవ్వాలన్నా, తెచ్చుకోవాలన్నా వివాహం ఖర్చులు భయపెడుతున్నాయి. ప్రధానంగా పేద, మధ్య తరగతి కుటుంబాలైతే ఆర్థికంగా చితికిపోతున్నాయి. బంధువర్గంలో పలుచన అవుతామనో, అతిథులు తమ ఆర్థికస్థితిని తక్కువగా అంచనా వేస్తారనో అపోహలతో ఎక్కువ మంది ఆర్భాటాలకు పోతున్నారు. దీనికితోడు సామాజిక మాధ్యమాల కారణంగా కొత్త సంప్రదాయాలు, ఆడంబరాలు వచ్చిపడుతున్నాయి. వాటికి ప్రభావితమైన వధూవరులు, వారి తల్లిదండ్రులు వివాహం ఖర్చును భారీ బడ్జెట్ సినిమాలా పెంచేస్తున్నారు. దుస్తులు, బంగార ఖర్చులు సరేసరి.
2021లో తులం బంగారం ధర రూ.52,000 ఉంటే ప్రస్తుతం రూ.80,000 దాటింది. అంటే 2 తులాల బంగారం కొనుగోలుకు సగటున రూ.56,000 ఖర్చు అదనంగా పెరిగిందన్న మాట. తనకు పెళ్లి వయస్సు వచ్చిన ఇద్దరు కుమార్తెలు ఉన్నారని, వివాహ ఖర్చులు తలుచుకుంటేనే ఆందోళనగా ఉందని రాష్ట్రంలోని నల్గొండ జిల్లాకు చెందిన కూరగాయల రైతు మాధవి చెప్పడం పరిస్థితి ఇందుకు నిదర్శనం. ఈ పరిస్థితుల్లో ఎవరితోనో పోల్చుకుని అపరిమితంగా ఖర్చులు పెంచుకుంటూ పోతే, అవి తరువాత కొన్ని సంవత్సరాల పాటు చిన్న చిన్న ఆనందాలకూ దూరం చేసే ప్రమాదం ఉందని, ఎవరికి వారు తమ అర్థిక స్థితిగతులను అంచనా వేసుకుని దానికి తగ్గట్టుగా ముందుకు వెళ్లడం మంచిదని నిపుణులు సూచినలు చేస్తున్నారు.
అలంకరణ, భోజనాలకే రూ.15 లక్షలు : తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో ఈ నెలాఖరు నుంచి పెళ్లిళ్ల సందడి మొదలవుతోంది. మే నెల వరకు ముహూర్తాలు ఉన్నాయి. ముఖ్యంగా ఫిబ్రవరి (మాఘ మాసం)లో వివాహం చేయాలనుకుంటున్న తల్లిదండ్రులు ఇప్పటికే హడావుడిలో ఉన్నారు. ఫంక్షన్ హాళ్లకు డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. హైదరాబాద్ నాగోలు ప్రాంతంలోని ఒక ఫంక్షన్ హాలుకు 12 గంటల కోసం రూ.6 లక్షలు అడుగుతున్నారు. నాలుగు సంవత్సరాల క్రితం అందులో సగం మాత్రమే ఉండేది. ఇలాంటి ఫంక్షన్ హాళ్లలో వేదిక ఇతర అలంకరణకు స్థాయిని బట్టి రూ.2 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు యాజమాన్యం వసూలు చేస్తున్నారు. ఫొటోలు, వీడియోల వంటి వాటికి రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షల దాకా చెబుతున్నారు. ఒక కుటుంబం ఇటీవల హైదరాబాద్ నగర శివారులోని ఒక రిసార్టులో 3 రోజుల పాటు సంగీత్, వివాహ కార్యక్రమాలను నిర్వహించింది. అక్కడ రిసార్టు అద్దె కాకుండా అలంకరణ, భోజనాలకే రూ.15 లక్షల వరకు చెల్లించినట్లు సమాచారం.
లెక్కలేనన్ని రుచులు - ఆహారం వృథా : చాలా వివాహాల్లో కనీసం 50 రకాలకు పైగా వంటకాలను ఏర్పాటు చేస్తున్నందున భోజనం ఖర్చులు భారీగా పెరుగుతున్నాయని ఓ క్యాటరింగ్ నిర్వాహకుడు ఒకరు అన్నారు. ఇటీవల చిన్న పట్టణంలో పెళ్లి చేసిన ఓ వ్యాపారి మొత్తం 54 రకాల వంటకాలను ఏర్పాటు చేయించారని, అథిదులకు స్వాగతం పలుకుతూ ఇచ్చేందుకు 4 రకాల పానీయాలు, 4 రకాల ఆహార పదార్థాలను ఏర్పాటు చేశారని తెలిపారు. ఆహారం వృథా కూడా ఎక్కువగా ఉంటోందని అన్నారు.
మధ్య తరగతి వారిపై అంతులేని భారం : పేద కుటుంబాలు సైతం అప్పులు చేసి ఒక పెళ్లికి సగటున రూ.10 లక్షలకు పైగా ఖర్చు చేస్తున్నారు. ముఖ్యంగా దిగువ, ఎగువ మధ్య తరగతి కుటుంబాల వారు బంధువులు, మిత్రుల పేరిట చాలా ఎక్కువగా ఖర్చుపెడుతున్నారు. సిద్దిపేట జిల్లాలో పని చేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు తన కూతురి వివాహానికి రూ.65 లక్షల దాకా ఖర్చు చేశారు. గుంటూరు జిల్లాకు చెందిన ఒక సాధారణ దుకాణం వ్యాపారి కూతురి నిశ్చితార్థానికి 500 మందిని పిలిచి రూ.12 లక్షలు ఖర్చు చేశారు. వచ్చే నెలలో జరిగే పెళ్లి ఖర్చులకు రూ.50 లక్షలు సిద్ధం చేసుకున్నట్లు ఆయన వివరించారు. మన దేశంలో వివాహానికి ఒక కుటుంబం సగటున 2023లోనే రూ.28 లక్షలు ఖర్చు పెట్టినట్లు ఓ సర్వేలో తేలింది. చాలా కుటుంబాలు తమ పిల్లల చదువుకు చేస్తున్న ఖర్చుకన్నా 2 రెట్లు అధికంగా పెళ్లికి పెడుతున్నట్లు ఆ సర్వే వెల్లడించింది.
- ప్రపంచంలో చైనా తర్వాత అత్యధికంగా వివాహ ఖర్చులు పెడుతున్న దేశం మనదే. భారత్‌లో పెళ్లిళ్లపై ఏటా రూ.10.70 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతున్నట్లు ఓ అంచనా. దేశంలో ఆహారం, గృహోపకరణాల తరువాత ప్రజలు ఎక్కువగా ఖర్చు పెడుతున్నది వివాహాలకే అని వివిధ అధ్యయనాల్లో వెల్లడైంది.
- పెళ్లికి పెద్ద సంఖ్యలో అతిథులను ఆహ్వానించి ఘనంగా నిర్వహించడంలో మన దేశంలో చాలా కుటుంబాలు చాలా ముందున్నాయి. అమెరికాలో ఒక పెళ్లికి పిలిచే అతిథుల సంఖ్య సగటున 115, బ్రిటన్‌లో 80, ఇండియాలో 326 దాకా ఉన్నట్లు వెడ్డింగ్ వైర్ అనే సంస్థ 2023 సంవత్సరంలో ర్వహించిన సర్వే తెలిపింది.
- నిజానికి తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో కనీసం 500 మందిని పిలవకుండా వివాహం చేయడం అరుదుగా మారింది. వచ్చే నెలలో తన కూతురిని సాఫ్ట్‌వేర్ ఇంజినీరుకు ఇచ్చి పెళ్లి చేయబోతున్న ఒక మధ్య తరగతి తండ్రి ఏకంగా 2,000 మందికి భోజనాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారంటే ఎంత ఖర్చు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
- 2023లో జరిగిన అన్ని రకాల పెళ్లిళ్లను పరిశీలిస్తే, 59 శాతం వరకూ ఆర్భాటంగా, భారీ ఖర్చులతో చేస్తున్నట్లు తేలింది.
ప్రీ వెడ్డింగ్ షూట్ : ఎంగేజ్‌మెంట్ అయ్యాక పెళ్లి అయ్యేలోగా ప్రీ వెడ్డింగ్ షూట్ పేరుతో కాబోయే జంట కలసి వీడియోలు, ఫొటోలు తీయించుకోవడం ఆనవాయితీగా మారింది. ఇందుకోసం కొందరు వివిధ ప్రాంతాలకు వెళుతున్నారు.
బ్యాచిలర్ పార్టీ : ఉత్తరాది సంప్రదాయాలైన హల్దీ, సంగీత్ వంటివి ఒకప్పుడు తెలుగు రాష్ట్రల్లో ఉండేవి కాదు. ఇటీవల వీటిని మన వాళ్లు కూడా ఫంక్షన్‌హాళ్లలో రూ.లక్షల ఖర్చుతో ఘనంగా వాటిని నిర్వహిస్తున్నారు. ఇక బ్యాచిలర్ పార్టీలు అంటూ మరికొంత ఖర్చు చేస్తున్నారు.
మన స్థాయికి తగ్గట్లుగానే ఖర్చులు చేద్దాం : అతి కొద్దిమంది మాత్రమే, ఎవరేమనుకుంటే మనకేంటి? చాటుగా ఎవరో ఏదో అంటారనో, అనుకుంటారనో ఆర్భాటాలకు పోయి అప్పులపాలవడం ఎందుకు? మన స్థాయికి తగ్గట్లుగానే ఖర్చులు చేద్దామంటూ పెళ్లి తంతును నిర్వహిస్తూ నిశ్చింతగా ఉంటున్నారు. మరికొందరు ప్రశాంతంగా వివాహం చేయాలనే ఉద్దేశంతో ఇరు కుటుంబాల రక్త సంబంధీకులతో రిసార్టులకు వెళ్లి 2, 3 రోజులుంటూ పెళ్లి చేసుకుంటున్నారు. తరువాత దగ్గరి బంధువులు, స్నేహితులకు ఇళ్లలోనే విందు ఇస్తున్నారు.