తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్​ 16 సీజన్లలో ఇప్పటివరకు బ్రేక్ కాని రికార్డులు ఏంటో తెలుసా ? - IPL 2024 CSK VS RCB

IPL All Seasons Records : మరికొద్ది గంటల్లో ఐపీఎల్ సీజన్ 17 మొదలు కానుంది. ఇప్పటికే పది జట్లు తమ గెలుపు కోసం సన్నాహాలు మొదలెట్టాయి. ఎప్పటిలాగే మరికొన్ని రికార్డులను లిఖించేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే ఇప్పటి వరకు జరిగిన 16 సీజన్లలో నమోదైన కొన్ని రికార్డులను ఎవ్వరూ బ్రేక్ చేయలేదట. అవేంటో ఓ లుక్కేద్దామా.

IPL 2024 CSK VS RCB
IPL 2024 CSK VS RCB

By ETV Bharat Telugu Team

Published : Mar 22, 2024, 7:23 AM IST

IPL All Seasons Records :క్రికెట్ లవర్స్​లో ఉత్తేజం నింపేఐపీఎల్‌ సీజన్ మరి కొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో ఇప్పటి వరకు టీమ్‌ఇండియా ప్లేయర్లతో పాటు మేటి విదేశీ క్రికెటర్లు సృష్టించిన రికార్డుల గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రతి మ్యాచ్‌లోనూ బ్యాట్‌కు, బంతికి మధ్య జరిగే యుద్ధం అభిమానులకు గూస్​బంప్స్ తెప్పిస్తుంది. అది టీవీలో చూసేవారికైనా, స్టేడియంలో తిలకించే వారికైన సరే ఆ పోరు వాళ్లను మునివేళ్లపై నిలబెడుతుంది. అందుకే ఈ లీగ్‌కు భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఫుల్‌ క్రేజ్‌ ఉంది. మరి ఇప్పటి వరకు 16 ఐపీఎల్​ సీజన్స్ జరిగాయి. అయితే ఇందులో ఇప్పటి వరకు బ్రేక్‌ కాని రికార్డులను ఓ లుక్కేద్దామా.

ఒకే సీజన్‌లో 973 పరుగులు
టీమ్ఇండియా స్టార్ క్రికెటర్, రన్నింగ్ మెషిన్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లోనే కాకుండా ఐపీఎల్‌లోనూ తనదైన ముద్ర వేశాడు. క్రీజులో కుదురుకుంటే ఇక పరుగుల వరద పారిస్తాడు ఈ మేటి బ్యాటర్. అయితే ఐపీఎల్‌లో ఓ అరుదైన రికార్డును నెలకొల్పాడు. 2016 సీజన్‌లో భీకరమైన ఫామ్‌లో ఉన్న ఈ స్టార్ క్రికెటర్ ఓ సీజన్​లో ఆడిన 16 మ్యాచ్‌ల్లో 81.08 సగటుతో 973 పరుగులు చేశాడు. ఏకంగా నాలుగు సెంచరీలు, ఏడు అర్ధ సెంచరీలను బాదాడు. ఇప్పటివరకు మరే ఆటగాడు కోహ్లీ 973 పరుగుల రికార్డును బ్రేక్‌ చేయలేకపోయారు. గుజరాత్ టైటాన్స్‌ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ 2023లో 890 పరుగులు కోహ్లీ తర్వాతి స్థానాన్ని సంపాదించుకున్నాడు.

వరుసగా 10 విజయాలు
ఏదైనా టోర్నీలో వరుసగా నాలుగైదు మ్యాచ్‌ల్లో విజయం సాధించడం కష్టం. అలాంటిది చివరి బంతి వరకు ఉత్కంఠ సాగే ఈ ఐపీఎల్‌ పోరులో ఈ ఫీట్​ను సాధించిన ఘనత ఓ టీమ్​కు ఉంది. అదే కోల్‌కతా నైట్‌రైడర్స్‌. 2014, 2015 సీజన్‌లో ఈ జట్టు ఏకంగా వరుసగా 10 మ్యాచ్‌ల్లో విజయం సాధించి రికార్డు సృష్టించింది. 2014లో ఫైనల్‌తో కలిపి వరుసగా తొమ్మిది విజయాలు సాధించిన కేకేఆర్‌, 2015 సీజన్‌ ప్రారంభ మ్యాచ్‌లోనూ గెలిచింది. ఇప్పటివరకు ఈ రికార్డును మరే జట్టు సాధించలేకపోయింది.

ఒకే మ్యాచ్‌లో 175 పరుగులు
ఐపీఎల్‌లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు సాధించిన రికార్డు వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ క్రిస్‌ గేల్ పేరిట ఉంది. 2013 సీజన్‌లో పుణె వారియర్స్‌ జట్టుపై అతడు 66 బంతుల్లో 13 ఫోర్లు, 17 సిక్స్‌లు బాది 175 పరుగులు స్కోర్ చేశాడు. ఇప్పటి వరకు జరిగిన 16 సీజన్లలో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు. అంతే కాకుండా ఇదే వేదికగా వేగవంతమైన సెంచరీ కూడా నమోదైంది. 30 బంతుల్లో గేల్ ఈ ఫీట్​ను నమోదు చేశాడు. దీంతో పాటు ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక (17) సిక్స్‌లు సాధించిన రికార్డును కూడా ఇప్పటి వరకు ఎవరూ బ్రేక్ చేయలేకపోయారు.

12 రన్స్ - 6 వికెట్స్​
నువ్వా నేనా అన్నట్లు ఉన్న మ్యాచుల్లో ఓ బౌలర్‌ ఒక మ్యాచ్‌లో ఐదు వికెట్లు పడగొట్టడమే అరుదైన ఘనత. అలాంటిది అరంగేట్ర మ్యాచ్‌లోనే ఓ స్టార్ క్రికెటర్ ఏకంగా ఆరు వికెట్లు పడగొట్టి రికార్డుకెక్కాడు. 2019లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్​పై ముంబయి ఇండియన్స్‌ బౌలర్‌ అల్జారీ జోసెఫ్‌ ఈ ఘనతను సాధించాడు. కేవలం 3.4 ఓవర్లలో 12 పరుగులే ఇచ్చి ఆరు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇది అరంగేట్ర మ్యాచ్‌లోనే కాకుండా టోర్నీలో చరిత్రలో అత్యుత్తమ బౌలింగ్ పెర్ఫామెన్స్​గా నిలిచింది.

'హ్యాట్రిక్' కింగ్
ఐపీఎల్‌లో ఒక్కసారి 'హ్యాట్రిక్‌' సాధించడమే రికార్డు. కానీ, ఓ స్టార్ బౌలర్‌ ఏకంగా మూడుసార్లు హ్యాట్రిక్‌ సాధించి అందరి చేత ఔరా అనిపించాడు. అతడే స్పిన్నర్‌ అమిత్‌ మిశ్రా. 2008లో దిల్లీ డేర్‌డేవిల్స్‌కు ప్రాతినిధ్యం వహించిన ఈ ప్లేయర్, అప్పటి డెక్కన్‌ ఛార్జర్స్‌ టీమ్​పై తొలి హ్యాట్రిక్‌ సాధించాడు. 2011లో దిల్లీ తరఫునే ఆడి కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌పై రెండోసారి ఈ అరుదైన ఫీట్ సాధించాడు. 2013లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున ఆడి పుణె వారియర్స్‌పై ముచ్చటగా మూడోసారి 'హ్యాట్రిక్‌' అందుకున్నాడు. అత్యధికసార్లు (3) హ్యాట్రిక్‌లు సాధించిన బౌలర్‌ కూడా అమిత్‌ మిశ్రానే.

ఒకే ఓవర్‌ 37 పరుగులు
ఐపీఎల్‌లో ఇద్దరూ స్టార్ క్రికెటర్లు ఒకే ఓవర్‌లో 37 పరుగులు సాధించి అభిమానులకు షాకిచ్చారు. 2011లో కొచ్చి టస్కర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ప్లేయర్ క్రిస్‌ గేల్ ప్రశాంత్ పరమేశ్వరన్ బౌలింగ్‌లో 6, 6 నోబాల్‌, 4, 4, 6, 6, 4 సాయంతో 37 పరుగులు సాధించాడు. 2021లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై జట్టు బ్యాటర్ రవీంద్ర జడేజా 37 రన్స్‌ చేసి గేల్ రికార్డును సమం చేశాడు. హర్షల్ పటేల్ బౌలింగ్‌లో 6, 6, నోబాల్‌, 6, 6, 2, 6, 4 సాయంతో ఈ ఫీట్‌ సాధించాడు. తర్వాత మరే ఆటగాడు ఈ రికార్డును అందుకోలేదు.

అత్యధిక భాగస్వామ్యం ఆ ఇద్దరిదే
ఐపీఎల్‌లో అత్యధిక (229) పరుగుల భాగస్వామ్యాన్ని విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్‌ ద్వయం పేరిట ఉంది. 2016లో గుజరాత్‌ లయన్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో ఈ ఆర్సీబీ జంట చెలరేగింది. కోహ్లీ (109; 55 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్‌లు), ఏబీ డివిలియర్స్‌ (129; 53 బంతుల్లో 10 ఫోర్లు, 12 సిక్స్‌లు) శతకాలతో రాణించారు. దీంతో ఆర్సీబీ 3 వికెట్ల నష్టానికి 248 పరుగులు స్కోర్ చేసింది. ఇక లక్ష్య ఛేదనలో గుజరాత్ లయన్స్‌ 104 పరుగులకే ఆలౌటైంది.

చెన్నై సిక్సర్ కొట్టేనా? - జట్టు బలాబలాలు ఇవే! - IPL 2024 CSK

IPL 2024 టైటిల్‌ వేటకు 10 టీమ్స్‌ కెప్టెన్లు రెడీ - ఎవరి సక్సెస్‌ రేటు ఎంత?

ABOUT THE AUTHOR

...view details